కర్ణాటక జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ఫైనల్ చేరుకుంది. హరియాణాతో జరిగిన సెమీఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15 ఓవర్లలోనే ఛేదించింది. ఛేదనలో ఆ జట్టు ఓపెనర్లు లోకేశ్ రాహుల్ (66; 31 బంతుల్లో 4×4, 6×6), దేవదత్ పడిక్కల్ (87; 42 బంతుల్లో 11×4, 4×6) అర్ధశతకాలతో చెలరేగారు. తొలివికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యం అందించారు. ముఖ్యంగా రాహుల్ తన స్ట్రోక్‌ప్లేతో అలరించాడు. కళ్లుచెదిరే సిక్సర్లు బాదాడు. వీరి విజృంభణతో కర్ణాటక 10 ఓవర్లలోనే 128 పరుగులు చేసింది. ఓపెనర్లు వెనుదిరిగాక మయాంక్ అగర్వాల్ (30; 14 బంతుల్లో 3×6), మనీశ్ పాండే (3; 3 బంతుల్లో) జట్టును విజయతీరాలకు చేర్చారు.
అంతకు ముందు కర్ణాటక బౌలర్ అభిమన్యు మిథున్ అద్భుతమైన రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్లో 6 బంతుల్లో 5 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా అవతరించాడు. హరియాణ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో అతడు ఈ రికార్డు నమోదు చేయడం గమనార్హం. చివరి ఓవర్ తొలి బంతికి హిమాన్షు రాణా (61; 34 బంతుల్లో 6×4, 2×6), రెండో బంతికి రాహుల్ తెవాతియా (32; 20 బంతుల్లో 6×4), మూడో బంతికి సుమిత్ కుమార్ (0) వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. నాలుగో బంతికి అమిత్ మిశ్రా (0), ఆరో బంతికి జయంత్ యాదవ్ (0)ను పెవిలియన్ పంపించి ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. హరియాణ ఓపెనర్ చైతన్య బిష్ణోయి (55; 35 బంతుల్లో 7×4, 1×6) అర్ధశతకం సాధించాడు.