telugu navyamedia
క్రీడలు వార్తలు

ప్రమాదంలో పంత్‌ కెరీర్‌…

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌ కెరీర్‌ ప్రమాదంలో పడిందని టీమిండియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇప్పటికైనా ఆటతీరు మార్చుకోవాలని సూచించాడు. పంత్ తనకున్న బద్దకాన్ని వదిలేసి ఆట మీద దృష్టి పెడితే మంచిదన్నాడు. పంత్‌ ఆటతీరు ఇలాగే కంటిన్యూ అయితే భవిష్యత్తులో టెస్టు జట్టులో కూడా చోటు దక్కడం కష్టమేనని ఆకాశ్‌ చోప్రా అంటున్నాడు. వాస్తవానికి పంత్ గతేడాది నుంచి సరైన ప్రదర్శన చేయట్లేదు. ఇప్పటికే టీ20, వన్డే జట్టులో పంత్ స్థానాన్ని కోల్పోయాడు. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా సెటిల్ అవ్వడంతో పంత్‌కు అవకాశమే లేకుండా పోయింది. తాజాగా ఆకాశ్‌ చోప్రా మాట్లాడుతూ… ‘ఆస్ట్రేలియా టూర్‌కు రిషబ్ పంత్‌ను కేవలం టెస్టు జట్టుకు మాత్రమే పరిగణలోకి తీసుకున్నా కేఎల్ రాహుల్‌ ఫామ్‌ దృష్యా.. మరోవైపు వృద్ధిమాన్‌ సాహాకు టెస్టుల్లో ఉన్న రికార్డు చూసుకుంటే పంత్‌ టెస్టులు ఆడడం కష్టమే. ఆసీస్‌-ఏతో జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లోనూ ఇండియా-ఏ తరపున పంత్‌ స్థానంలో సాహాకు స్థానం లభించిదంటేనే విషయం అర్ధమయి ఉండాలి. రానున్న రోజుల్లో పంత్‌ టెస్టుల్లో కూడా తన స్థానాన్ని కోల్పోనున్నాడు. ఇప్పటికైనా బద్దకాన్ని వదిలేసి ఆటతీరును మార్చుకోవాలి. ఆటలో తను చేసిన తప్పిదాలే.. ఇప్పుడు పంత్‌ కెరీర్‌ను ప్రశ్నార్థకం చేశాయి’ అని అన్నాడు.

‘రిషబ్ పంత్ స్వయంగా తన కెరీర్‌ను తానే నాశనం చేసుకుంటున్నాడు. మళ్లీ తుది జట్టులోకి రావాలంటే కఠోర సాధన చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే అతని కెరీర్‌ ముగిసినట్లే’ అని వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా వెల్లడించాడు. చోప్రా పంత్‌పై చేసిన వ్యాఖ్యలు నిజమనే అభిప్రాయం వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. వాస్తవానికి పంత్‌ మంచి టెక్నిక్‌ ఉన్న ఆటగాడు.. టీమిండియాకు ఎంపికైన మొదట్లో దూకుడైన ఆటతీరును చూసి మంచి భవిష్యత్తు ఉన్న ఆటగాడిగా పేరు సంపాదిస్తారని అంతా భావించారు. కానీ రానురాను పంత్‌ ఆటతీరులో నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపించేది. ఎదో మొక్కుబడికి ఆడుతున్నామా అన్నట్లుగా అతని షాట్లు ఉండేవి. ఆట కీలకదశలో ఉన్న సమయంలో ఎన్నోసార్లు నిర్లక్ష్యంగా వికెట్‌ సమర్పించుకునేవాడు. రిషబ్ పంత్ విఫలమవుతుంటే.. ఇదే సమయంలో కేఎల్‌ రాహుల్‌ నిలకడైన ప్రదర్శన చేస్తూ టీమిండియాలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. ఒకవైపు వికెట్ కీపింగ్.. మరోవైపు బ్యాటింగ్ తో జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. ఇక పంత్‌ నిర్లక్ష్యమే ఇప్పుడు ఆసీస్‌తో జరిగిన పరిమిత ఓవర్లతో పాటు ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్‌కు దూరం చేసింది. ఐపీఎల్ 2020‌లోనూ పంత్‌ ఒక్క మంచి ఇన్నింగ్స్‌ ఆడలేదు. ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌లు గెలవడంలో సహకరించిన పంత్..‌ భారీ ఇన్నింగ్స్‌లు మాత్రం ఆడలేకపోయాడు. ప్రస్తుతం పంత్ కెరీర్ ప్రశ్నార్ధకంలో పడిపోయింది.

Related posts