ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదురింది.
ఆరోగ్య సంరక్షణ, మెడ్టెక్, విద్య, వ్యవసాయం వంటి కీలక రంగాలలో తక్కువ ఖర్చుతో కూడుకున్న, విస్తరించదగిన పరిష్కారాలను అనుసంధానించడం ద్వారా ప్రజల సంక్షేమం కోసం సాంకేతికతను ఉపయోగించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశ్యం.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ తో సమావేశమయ్యారు. రాష్ట్రాభివృద్ధి దిశగా ఇరువురు అనేక అంశాలపై లోతైన చర్చ జరిపారు.
ఈ సందర్భంగా ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ అవగాహన ఒప్పందం ఏపీ గవర్నమెంట్, గేట్స్ ఫౌండేషన్ మధ్య వ్యూహాత్మక సహకారానికి రూపకల్పన చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన భాగస్వాములకు, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలలో వివిధ ప్రయోజనాల కోసం గేట్స్ ఫౌండేషన్ మద్దతు ఇస్తుంది.
ఈ భాగస్వామ్యం ద్వారా ఆరోగ్య విశ్లేషణ, ఆటోమేటెడ్ డయాగ్నస్టిక్స్ కోసం ఏఐని ఉపయోగించడం జరుగుతుంది.
వ్యవసాయంలో, ఏఐ ఆధారిత సలహా వేదికలు, ఖచ్చితమైన వ్యవసాయం, వనరుల నిర్వహణ కోసం ఉపగ్రహ ఆధారిత వ్యవస్థలను ప్రవేశపెట్టనున్నారు.
గేట్స్ ఫౌండేషన్ మద్దతుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలనే తన నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.
గేట్స్ ఫౌండేషన్ తో మా భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది.
ఏఐ ఆధారిత పాలన, మానవ మూలధన అభివృద్ధి, ఆరోగ్యం, వ్యవసాయం, విద్యలో సాంకేతిక ఆవిష్కరణలను ఉపయోగించడం ద్వారా, ఈ అవగాహన ఒప్పందం ద్వారా వచ్చే ఫలితాలు మన రాష్ట్రానికి మాత్రమే కాకుండా, ఇతర ప్రాంతాలకు కూడా ఆదర్శంగా నిలుస్తాయి అని ముఖ్యమంత్రి అన్నారు.
డేటా ఆధారిత ఆవిష్కరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడానికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని బిల్ గేట్స్ ప్రశంసించారు.