telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మా నాన్నే నాకు స్ఫూర్తి – రాజ్ కుమార్

a memory with actor raj kumar

కన్నడ చిత్ర రంగంలోనే కాదు, భారతీయ సినిమాలో చిరస్మరణీయమైన నటుడు పద్మభూషణ్, కన్నడ రత్న, దాదా సాహెబ్ ఫాల్కే రాజ్ కుమార్. 1954 నుంచి 2006 వరకు కన్నడ సినిమాను శ్వాసించి శాసించిన మహా నటుడు రాజ్ కుమార్. 19 సంవత్సరాల క్రితం ఇదే రోజు బెంగళూరులో మాట్లాడిన అపూర్వ సంఘటన ఇంకా స్మృతి పథంలో మెదులుతూ వుంది. 2000 సంవత్సరంలో నిర్మాత నారా జయశ్రీదేవి రాఘవేంద్ర రావు దర్శకత్వంలో “శ్రీమంజునాథ “అనే చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో రూపొందించారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి జయశ్రీదేవి గారు హైదరాబాద్ నుంచి జర్నలిస్టులను ఆహ్వానించారు.

a memory with actor raj kumarనేను అప్పుడు ఆంధ్ర ప్రభ దిన పత్రికలో సినిమా పేజీ ఇంఛార్జిగా వున్నాను. ఈ సినిమాలో చిరంజీవి, అర్జున్, సౌందర్య, మీనా, అంబరీష్, సుమలత, ద్వారకేష్ మొదలైన వారు నటించారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం జూన్ 3వ తేదీన బెంగళూరు కంఠీరవ స్టూడియోస్ లో జరిగింది. శ్రీమంజునాథ చిత్ర ప్రారంభోత్సవానికి కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ ఆయన శ్రీమతి పార్వతమ్మ వచ్చారు. కన్నడ నాట రాజ్ కుమార్ కున్న క్రేజ్ ఏమిటో మొదటిసారి చూశాను. శ్రీమంజునాథ సినిమా తెలుగు, కన్నడ తారలతో ప్రారంభం చాలా కోలాహలంగా, సందడిగా జరిగింది.

అప్పుడు జయశ్రీదేవిగారితో రాజ్ కుమార్ గారిని మాతో మాట్లాడించమని చెప్పాను. ఆమె పార్వతమ్మ గారితో చెబితే ఆమె తప్పకుండా అని హామీ ఇచ్చింది. పార్వతమ్మ మాట అంటే రాజ్ కుమార్ గారికి వేద వాక్కు. రాజ్ కుమార్ గారు ఎక్కడికి వెళ్లినా ఆయనతో పాటు శ్రీమతి పార్వతమ్మ వెంట ఉండాల్సిందే. పార్వతమ్మ కు చెప్పకుండా రాజ్ కుమార్ ఏపని చెయ్యరు అంటారు. సినిమా ప్రారంభ హడావిడి ముగిసిన తరువాత రాజ్ కుమార్ గారిని తీసుకొని పార్వతమ్మ వచ్చింది. అప్పటికే అక్కడ జయశ్రీదేవి ఒక సోఫా కొన్ని కుర్చీలుమాకోసం ఏర్పాటు చేశారు. ముందుగా మేమందరం పరిచయం చేసుకున్నాము. ఆ తరువాత ఇంగ్లీషులో ప్రశ్నలు అడగటం మొదలు పెట్టాము. మాకు కన్నడ రాదు. అయితే రాజ్ కుమార్ గారు మా వైపు చూసి ” నేను తెలుగు మాట్లాడతాను … మీరంతా తెలుగులోనే అడగండి ” అన్నారు నవ్వుతూ. 1954లోరాజ్ కుమార్ గారు “బెదర కన్నప్ప ” అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. అదే సంవత్సరం ఆ సినిమాను తెలుగులో పునర్నిర్మిస్తున్నప్పుడు ఆ చిత్ర దర్శకుడు హెచ్.ఎల్.ఎన్ సింహ రాజ్ కుమార్ నే ఎంపిక చేసుకున్నారు. ఆ రకంగా రాజ్ కుమార్ తెలుగు సినిమా “శ్రీకాళ మహత్యం ” చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయ అయ్యారు. రాజ్ కుమార్ .. సూపర్ స్టార్ … అయితే ఆయన మాట్లాడిన విధానం .. మాతో స్నేహ భావతో గడపడం చుసిన తరువాత రాజ్ కుమార్ ఎంతో సంస్కారమైన వ్యక్త్తో అర్ధమైంది. ఏ మాత్రం అహం, ఆడంబరం లేకుండా, చాలా సాదా సీదాగా నవ్వుతూ మాట్లాడటం ఆశ్చర్య మనిపించింది.

a memory with actor raj kumarఆయన చిన్ననాటి ముచ్చట్లు, తండ్రి పుట్ట స్వామి ముత్తు రాజ్, తల్లి లక్ష్మియమ్మ ఎలా పెంచారో చెప్పారు. తనకి జీవితాల్లో ఎక్కువ ప్రేరణ ఇచ్చింది తండ్రే నని, ఇప్పటికీ ఈ పని ప్రారంభించినా తన తండ్రిని తలుచుకుంటానని ఎంతో వినమ్రంగా చెప్పాడు. తెలుగు సినిమా రంగంలోని అగ్ర నటులు ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వర రావు ఇద్దరు మంచి స్నేహితులని, తెలుగు వారన్నా ఎంతో అభిమానమని రాజ్ కుమార్ తెలిపారు. మద్య మద్యలో పార్వతమ్మ కూడా మాతో మాట్లాడారు. జీవితంలో ఎన్నో నేర్చుకున్నానని .. మనిషి ఎంతో ఎత్తు ఎదిగినా కాళ్ళు మాత్రం నేలమీదనే కదా ఉండేది అని చెప్పి ఆశ్చర్యపరిచారు. రాజ్ కుమారు ప్రారంభించిన శ్రీమంజునాథ సినిమా కన్నడంలో 22జూన్ 2001న విడుదలైంది. తెలుగులో 31 జులై 2001న విడుదలైంది.

-భగీరథ

Related posts