ఎంసెట్ ఫలితాలు, ర్యాంకుల ఖరారులో నార్మలైజేషన్ ప్రక్రియను అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇది అత్యంత గోప్యంగా జరిగే వ్యవహారమని అధికారులు అంటున్నారు.

ఈ ఏడాది ఇంటర్ మార్కులకు వెయిటేజీ పద్ధతి రద్దు చేసినందున 25న ప్రకటించే ర్యాంకులే తుది కానున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ఎంసెట్‌ను ఆరు సెషన్లలో నిర్వహించారు. ఒక సెషన్‌లో ఈజీ పేపర్, మరో సెషన్‌లో హార్డ్ పేపర్ వ్యత్యాసాల కారణంగా విద్యార్థులెవరూ నష్టపోకుండా నార్మలైజేషన్ ప్రక్రియను అనుసరించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి సూచించిన సంగతి తెలిసిందే.

ఏఐసీటీఈ సూచనల మేరకు నార్మలైజేషన్ ప్రక్రియ కింద కఠినమైన ప్రశ్నాపత్రం వచ్చిన అభ్యర్థులకు మార్కులు కలుపుతారు.. అలాగే ఈజీ పేపర్ వచ్చినవారి మార్కుల్లో కోత విధిస్తారు. కఠినమైన, సులభమైన ప్రశ్నాపత్రాలను నిర్ధారించేందుకు నిపుణుల కమిటీని ఇదివరకే నియమించారు. దీని సూచనల ఆధారంగా జేఎన్టీయూ అధికారులు ఇప్పటికే నార్మలైజేషన్ ప్రక్రియను పూర్తిచేసినట్టు సమాచారం.


