నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం వినోదా పిక్చర్స్ వారి “కన్యా శుల్కము” 26-08-1955 విడుదలయ్యింది.
నిర్మాత డి.ఎల్. నారాయణ గారు వినోదా పిక్చర్స్ బ్యానర్ పై ప్రఖ్యాత దర్శకుడు పి.పుల్లయ్య గారి దర్శకత్వంలో ఎంతో ప్రసిద్ధి చెందిన మహాకవి గురజాడ అప్పారావు గారు రచించిన “కన్యాశుల్కం” నాటకాన్ని సినిమాగా తీశారు.
ఈ చిత్రానికి కథ: గురజాడ అప్పారావు పంతులు, మాటలు: వెంపటి సదాశివబ్రహ్మం, పాటలు: మల్లాది, బసవరాజు అప్పారావు ,వెంపటి సదాశివబ్రహ్మం, శ్రీ శ్రీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి,గురజాడ అప్పారావు, సముద్రాల రాఘవాచార్య, సంగీతం: ఘంటసాల, సినిమాటోగ్రఫీ: ఎన్.ప్రకాష్, కళ: గొడగాంకర్ – వాలి, నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి, ఎడిటింగ్: ఆర్.హనుమంతరావు, అందించారు.
ఈ చిత్రంలో మహానటుడు ఎన్.టి.రామారావు గారు గిరీశం పాత్ర, మహానటి సావిత్రి మధురవాణి పాత్ర, జానకి బుచ్చెమ్మ పాత్రల లోను నటించగా మిగిలిన పాత్రలలో గోవిందరాజుల సుబ్బారావు, సి.యస్.ఆర్. ఆంజనేయులు, విన్నకోట రామన్న పంతులు, వంగర వెంకటసుబ్బయ్య, గుమ్మడి,.హేమలత,సుభద్ర, సూర్యకాంతం,ఛాయాదేవి, పేకేటి శివరాం, గౌరీపతిశాస్త్రి, చదలవాడ, మాస్టర్ కుందు, శేషగిరిరావు, కంచి నరసింహారావు తదితరులు నటించారు.
ప్రముఖ సంగీత దర్శకులు ఘంటసాల గారి స్వరకల్పనలో వచ్చిన పాటలు…
“ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే”
“ఇల్లు ఇల్లు అనియేవు ఇల్లు నాదనియేవు నీ ఇల్లు ఎక్కడే చిలకా”
“చేదాము రారే కల్యాణము చిలకా గోరింక పెళ్ళి సింగారం”
“చిటారు కొమ్మను మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా”
“పుత్తడిబొమ్మా పూర్ణమ్మా … మేలిమి బంగరు నెలతల్లారా”
వంటి పాటలు శ్రోతలను అలరించాయి.
సహజంగా హీరో పాత్రలు వేసే ఎన్టీఆర్ గారు ఈ చిత్రం లో నెగిటివ్ షేడ్స్ ఉన్న గిరీశం పాత్రను పోషించారు.
ఈ చిత్రం తొలి సారి విడుదలైనప్పుడు విజయవంతం కాలేకపోయింది.
కానీ ఆ పిదప ఫస్ట్ రిలీజ్ లో కన్నా పలు పర్యాయాలు విడుదలైనప్పుడు ఎక్కువ విజయం సాధించిన కొద్ది చిత్రాల్లో ‘కన్యాశుల్కం’ ఒకటి.
మొదటి సారి విడుదల తర్వాత 28 ఏళ్లకు 1983లో ఈ చిత్రం హైదరాబాద్ లో విడుదలై సంధ్య 70 ఎం.ఎం.
థియేటర్ లో ఉదయం ఆటలతోనూ, వేరే థియేటర్లలో మూడు ఆటలతోనూ 100 రోజులు ప్రదర్శింపబడి రికార్డ్ సృష్టించింది.
హైదరాబాద్ సంధ్య థియేటర్ లో ఏకధాటిగా 130 రోజులకు పైగా ఆడింది. అంతేకాకుండా అన్ని రోజులు ఇతర థియేటర్లలో షిప్టుల మీద మూడు ఆటలతోను ఆడింది.
పిదప షిప్టుతో 175 రోజులు ప్రదర్శించబడింది. అలాగే 50 సంయుక్తవారాలు జరుపుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది ‘కన్యాశుల్కం’ చిత్రం.
ఈ చిత్రం 1986 లో విడుదలైనప్పుడు విజయవాడ – విజయా టాకీస్ లోను, గుంటూరు – రాధాకృష్ణ లోనూ నూన్ షో లతో డైరెక్ట్ గా వంద రోజులు ఆడింది.
ఆ తర్వాత గురజాడ వారి ‘కన్యాశుల్కం’ .నాటకం శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రం 1993లో మరోమారు విడుదలై మరల హైదరాబాద్ లో శతదినోత్సవం జరుపుకోవడం విశేషం.
ఈ విధంగా పలు పర్యాయాలు శతదినోత్సవం జరుపుకున్న చిత్రం గా “కన్యాశుల్కము” రికార్డ్ సష్టించింది.
1)1983 లో హైదరాబాద్ — సంధ్య లో 130 రోజులు ఆడింది. అలాగే కల్పన, దీపక్ మహల్ లలో షిఫ్ట్ తో 175 రోజులు ఆడింది.
2)1986 లో విజయవాడ — విజయాటాకీస్ లో 100 రోజులు ఆడింది.
3)1986 లో గుంటూరు — రాధాకృష్ణ లో 100 రోజులు ఆడింది.
4)1996లో హైదరాబాద్ — సప్తగిరి లో 51 రోజులు ఆడిన పిదప షిఫ్ట్ తో 100 రోజులు ఆడింది.
ఈ విధంగా ఒకే సినిమా రిపీట్ రన్ లలో 4 సార్లు 100 రోజులు ప్రదర్శింపబడి,ఆల్ ఇండియా రికార్డ్ క్రియేట్ చేసింది.
నేను ఓటు వేసిన సభ్యులే గెలుస్తారు: బండ్ల గణేశ్