telugu navyamedia
సినిమా వార్తలు

అనారోగ్యంతో దర్శకుడు, నటుడు రాజశేఖర్ మృతి

Rajasekhar

ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు రాజశేఖర్ ఆదివారం కన్నుమూశారు. ఆయన వయస్సు 62 ఏళ్లు. చెన్నైలోని వలసరవాక్కంలో నివాసం ఉంటున్న రాజశేఖర్ ఇటీవల అస్వస్థత కారణంగా స్థానిక రామచంద్ర ఆసుపత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఆయన అభిమానుల నుంచి సంతాపాలు వెల్లువెత్తాయి. రాజశేఖర్ దర్శకుడిగా తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ‘పలైవనచోలై’ ‘చిన్నపూవే మెల్ల పెసు’ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థి అయిన రాజశేఖర్ తొలిసారి నటుడిగా నిగల్‌గల్ (1980) చిత్రంలో నటించారు. దీనికి భారతీరాజా దర్శకత్వం వహించారు. ఆ తర్వాత సినిమాటోగ్రాఫర్‌ రాబర్ట్‌ సహచర్యంతో దర్శకుడిగా మారారు. ‘ఒరు తాలై రాగం’, ‘మనసుక్కుల్ మతప్పు’ వంటి చిత్రాలు ఈ కాంబినేషన్‌కు మంచి పేరు తెచ్చాయి. రెండేళ్ల క్రితం రాబర్ట్ కన్నుమూశారు. దీంతో రాజశేఖర్ మళ్లీ నటన వైపు వచ్చారు. ‘శరవణన్ మీనాక్షి’ సీరియల్‌లో హీరో తండ్రి పాత్రలో ఆయన నటన ప్రశంసలు అందుకుంది. అప్పట్నించి ఆయన ఎక్కువగా తమిళ టీవీ సీరియల్స్‌కే పరిమితమవుతూ వచ్చారు. రాజశేఖర్ మృతి పట్ల తమిళ సినీ పరిశ్రమతో పాటు అభిమానులు సంతాపం ప్రకటించారు.

Related posts