telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

కర్నూలు : .. 60 లక్షల వజ్రం .. పొలంలో ..

60laks diamond caught by villager

మరోసారి జిల్లాలో విలువైన వజ్రం లభ్యమైంది. తుగ్గలి మండలం ఉపర్లపల్లె మాజారా గ్రామమైన గొల్లవనేపల్లె పొలంలో విలువైన వజ్రం దొరికింది. దాని విలువ రూ.60లక్షలు అని తెలుస్తోంది. అయితే దాన్ని తక్కువ ధరకు అల్లాబకాష్ అనే గుత్తి వ్యాపారి కొన్నాడు. 13లక్షల 50వేల రూపాయల నగదు, 5తులాల బంగారం ఇచ్చి వజ్రాన్ని కొన్నట్లు సమాచారం. వజ్రాల వ్యాపారులు బహిరంగంగా కొంటున్నా.. రెవెన్యూ , గనులు, భూగర్భశాఖ, పోలీసు, ఆర్కియాలిజీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. అధికారులు చూసీ చూడనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ అధికారులను వజ్రాల వ్యాపారులు మ్యానేజ్ చేస్తుంటారనే వాదనా ఉంది. వజ్రాలు ఇలా అమ్మేసుకోవడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. తొలకరి జల్లు పడిందంటే చాలా కరవు సీమలో ఎర్రటి నేలల్లో వెదుకులాట మొదలవుతుంది.

ఒళ్లంతా కళ్లు చేసుకుని తళుక్కుమనే మెరుపు కోసం వెతుకులాట ప్రారంభమవుతుంది. ఒక్కటంటే ఒక్కటి దొరికితే జీవితమే మారిపోతుంది. కరవంతా తీరిపోతుంది. కరవు సీమలో ఆడా, మగా..చిన్నా చితకా..ముసలీ ముతకా అంతా ఎర్ర నేలలను జల్లెడ పట్టేస్తుంటారు. ఈ వెతుకులాటంతా వజ్రాలు కోసం. నేలల్లో దాగి ఉన్న వజ్రాలు తొలకరి జల్లులకు బైటపడతాయి. రాయలసీమలో వరుణుడి కరుణతో రతనాలు వెలుగులోకి వస్తాయి. కర్నూలు జిల్లాలో వజ్రాలకు పేరు గాంచింది…వజ్రకరూరు. ఏటా తొలకరి వర్షాలు కురవగానే ఆశల వేట ప్రారంభమవుతుంది. అదృష్టం కొద్దీ ఒక్క వజ్రమైన తమ కళ్లబడకపోతుందా అని..ఓ రంగురాయి తమ జీవితం మార్చకపోతుందా అనే ఆశతో వెతుకుతారు. ప్రతీ ఏటా తొలకరి జల్లులు పడే సమయంలో పొలాల్లో 10 నుంచి 20 వరకు వజ్రాలు దొరుకుతాయని స్థానికులు చెబుతుంటారు. అనంతపురం జిల్లాలోనూ పొలాల్లో వజ్రాల వేట మొదలైపోతుంది. వజ్రాల కోసం స్థానికులే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలి వచ్చే జనంతో ఎర్రటి పొలాలన్నీ నిండిపోతాయి.

Related posts