telugu navyamedia
వార్తలు సామాజిక

అరవయ్యేళ్ళ గ్రామీణ దృశ్యం ..

అరవై అయిదేళ్ళ పైమాటే. అప్పటికి నాకు పదేళ్లు వచ్చాయేమో! ఆనాటి గురుతులన్నీ స్పష్టాస్పష్టంగా మనసులో మెదులుతున్నాయి. మరచిపోతానేమో అన్న సంశయంతో ఈ రాతలకు శ్రీకారం. మా ఊరు కంభంపాడు. అప్పట్లో చాలా వెనకపడ్డ ప్రాంతం. అయినా అన్నీ ఉండేవి. స్వావలంబన లాంటి మాటలు వాటి అర్ధాలు అప్పట్లో తెలవ్వు. కానీ అన్నీ అమర్చినట్టు ఉండేవి.

మా ఇంటికి దగ్గరలో అంటే నడిచిపోయే దూరంలో చెరువు గట్టు కింద మా మాగాణి పొలాల పక్కన ఓ మెరక మీద మంచి నీళ్ళ బావి. పైగా గిలకల బావి. నాలుగువైపులా గిలకలు ఉండేవి.

5 Things to Know When Buying a Home With a Well

ఊరి మొత్తానికి అదొక్కటే మంచి నీటి వనరు. మా ఇంట్లో బావిలో నీళ్ళు ఉప్పు నీటి కషాయం. స్నానాలకు, ఇతర అవసరాలకు ఆ నూతి నీళ్ళే వాడేవాళ్ళం. మా అమ్మగారు వెంకట్రావమ్మ, మా చిన్న మేనత్త చిదంబరం తడి మడి చీరెలతో వెళ్లి మంచి నీటి బావి నుంచి బిందెలలో నీళ్ళు తెచ్చేవాళ్ళు. అప్పుడప్పుడూ వాళ్ళతో నేనూ వెళ్ళే వాడిని. దోవలో వీర బ్రహ్మం ఇల్లు.

ఆయన ఉలీ, బాడిసె పట్టుకుని ఎడ్లు లాగే బండ్లు తయారు చేసేవాడు. నేను అక్కడే ఒక మొద్దు మీద కూర్చుని చూస్తూ కూర్చుండేవాడిని. బండి చక్రాలు, వాటికి ఆకులు అలా కొలతలకు తగ్గట్టుగా ఎలా చెక్కేవాడో ఆశ్చర్యం అనిపించేది. ఆయన ఏమీ చదువుకున్నవాడు కాదు. కానీ బండి ఇరుసు ఏ కొలతలతో చెక్కితే బండి బ్యాలెన్సుగా నడుస్తుందో ఆ విధంగా తయారు చేసేవాడు.ఆ పక్క వీధిలో కమ్మరి కొలిమి. ఆయనకూ చదువు రాదు. కానీ ఇనుమును కొలిమిలో ఎర్రగా కాల్చి రకరకాల సామాగ్రి తయారు చేసేవాడు.

ఒక వీధిలో వస్త్రాల హనుమంతరావు అని నా దోస్తు ఇల్లు వుండేది. ఆడామగా బట్టలు నేసేవాళ్ళు. ఇంటి బయట చేతికి రంగులు పూసుకుని దారాలకు రంగులు అద్దేవాళ్ళు. ఇంట్లో మగ్గం మీద చీరెలు దోవతులు నేసేవాళ్ళు. చిన్ని రాములు కొట్లో మిఠాయి ఉండలు, లౌజు ముక్కలు కూడా అమ్మేవాళ్లు. ఇళ్ళల్లో లాంతర్లు, చిమ్నీ దీపాలకు వాడే కిరసనాయిలు అక్కడే కొనేవాళ్ళం. కిరోసిన్ డబ్బా పైన ఒక మూలలో వున్న రంధ్రంలో గొట్టం లాంటి సాధనం వుంచి పైకీ కిందికీ అంటుంటే డబ్బాలో కిరోసిన్ సీసాల్లో పడేది.

Telangana Kummari... - Telangana Kummari Sangam Shalivahana
ఆ పక్కనే కుండలు చేసేవారు. కుండలు చేసే విధానం చూస్తుంటే కళ్ళు తిరిగిపోయేవి. ఒక చక్రం మీద మట్టి ముద్ద వుంచి ఆ చక్రాన్ని వేగంగా ఒకసారి తిప్పేవాళ్ళు. చేతి వేళ్ళతో ఆ ముద్దను సుతారంగా తాకుతూ చిత్రవిచిత్రంగా కుండలు తాయారు చేసేవాళ్ళు. ఆ ముద్ద నుంచి కుండల ఆకారాలు వస్తుంటే ఏదో మాయాజాలంగా అనిపించేది.

సాయంత్రం అయ్యేసరికి మా ఇంటికి దగ్గరలో ఉన్న వాడ నుంచి బ్యాండు మేళం వినపడేది. ఆ తర్వాత తెలిసింది వాళ్లకు గిరాకీ లేని రోజుల్లో అలా తీరి కూర్చుని సినిమా పాటలు ప్రాక్టీసు చేస్తుంటారని. అలాగే సన్నాయి మేళం వాయించేవాళ్లు. మా ఇంటికి చుట్టపక్కాలు ఎవరైనా వస్తే వాళ్ళు పెట్రోమాక్స్ లైట్ తెచ్చి పెట్టేవాళ్ళు. ఆ లైటు వెలిగిస్తుంటే పిల్లలం అందరం కళ్ళప్పగించి చూస్తుండే వాళ్ళం. పొడుగాటి వత్తి తగలబడిపోకుండా చిన్న ఆకారంలోకి మారిపోయి తెల్లటి వెలుగులు విరజిమ్మడం నిజంగా ఆశ్చర్యంగా వుండేది. ఆ వత్తి ఎర్రపడి కాంతి తగ్గినప్పుడల్లా గాలి కొట్ట్టేవారు.

ganesh-puja-02-06-2020 - HinduBulletin
మా ఊరు పంచాంగాలకు ప్రసిద్ధి. వాటిని రాసే సిద్ధాంతులు ముగ్గురు వుండేవాళ్ళు. ఒకే ఊరు నుంచి మూడు పంచాంగాలు రావడం గొప్పగా చెప్పుకునే వారు. గొలుసుకట్టు రాతలో, తెలుగు అంకెలతో రాసిన పంచాంగాలను ఆ సిద్ధాంతులు తెనాలి తీసుకువెళ్లి అక్కడ అచ్చు వత్తించేవారు. ఉగాది రావడానికి ముందుగానే చుట్టుపక్కల గ్రామాలకు కాలినడకన వెళ్లి అక్కడి మోతుబరులకు పంచాంగాలు ఇచ్చి ఆశీర్వదించేవాళ్లు. సంభావన రూపంలో వచ్చిన ప్రతిఫలం ఎంత ఇస్తే అంత తీసుకుని తిరిగివచ్చేవారు. మంచి నీళ్ళ బావికి వెళ్ళే దోవలో ముస్లిం ల కోసం పీర్ల సావిడి వుండేది. పీర్లను ఊళ్ళో ఊరేగించిన తర్వాత మళ్ళీ ఈ సావిడిలో భద్రపరిచేవాళ్ళు. షెడ్యూల్ కులాలకోసం ఉసిగెవాగు అవతల ఒక కాలనీ వుండేది.

అక్కడ ఒక మిషనరీ స్కూలు వుండేది. ఊళ్ళో మరో బడి వుండేది. అందులోనే మా చదువు. స్కూలు మొత్తానికి కలిపి ఇద్దరు టీచర్లు, అప్పయ్య మాస్టారు, భద్రయ్య పంతులు గారు. బ్లాకు బోర్డులు లేవు. చుట్టూ ఫ్రేం ఉన్న బొందు పలక, సుద్ద బలపం, అవి పెట్టుకునే గుడ్డ సంచీ వుంటే వాడు అందరి దృష్టిలో స్పెషల్. అప్పయ్య మాస్టారి తండ్రి శివరాజు నాగభూషణం గారు తెలవారకముందే లేచి స్నాన సంధ్యాదులు ముగించుకుని ఇంటి బయట నిలబడి ఉచ్చైస్వరంతో ఆలపించే కృష్ణ శతకంలోని పద్యాలే ఊరంతటికీ కోడి కూత.

Karnataka Education Department join hands with Karnataka Government to put 76000 schools on GIS map - Analytics India Magazine

మా ఇంటికి వెనుక రెండు దేవాలయాలు ఒకే ప్రాకారంలో ఉండేవి. పక్కనే కోనేరు వుండేది. కాలక్రమంలో అది పూడిపోయింది. ఆ గుళ్ళకు మేమే వంశ పారంపర్య ధర్మకర్తలం. వాటికి మాన్యాల రూపంలో నలభయ్ ఎకరాల దాకా భూమి వుండేది, కానీ వాటి మీద వచ్చే అయివేజు స్వల్పం. వూళ్ళో వాళ్ళే పూనుకుని పండుగ దినాల్లో ఉత్సవాలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించేవారు. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ వారి చిన తిరుణాలకు, అది జరిగినన్ని రోజులూ మా వూరినుంచి రంగు కాగితాలతో అలంకరించిన ప్రబ్భండ్లు (ప్రభలు) మేళతాళాలతో ఇంటికొకటి బయలుదేరేవి.

Hampi :The abode of bygone ruins, rusty colors and fascinating landscape - Bangalore Next
ఆ రోజుల్లో మా ఊర్లో రెండు రకాల సేద్యపు నీటి వనరులు ఉండేవి. ఒకటి చెరువు, రెండోది మునేటి కాలువ. ఒకప్పుడు ఈ రెంటి కిందా అధిక భాగం భూములు మావే. ఐదో అక్కయ్య భర్తది పొరుగూరు పెనుగంచి ప్రోలు. ఆ బావగారు వచ్చినప్పుడల్లా గుర్రపు సవారీ. రాగానే గుర్రాన్ని మేతకు వదిలేసేవాడు. అది మేసినంత మేరా మామగారు (అంటే మా నాన్నగారు) తాలూకు పొలాలే, ఏం పరవాలేదు అని చెప్పుకునే వారు నా చిన్నతనంలో.

vinod kumar: Vari polam

ఇప్పుడు ఇవన్నీ ఏవీ లేవు అని చెప్పను కానీ అప్పటి మాదిరిగా లేవు. కొన్ని అసలే లేవు, జ్ఞాపకాలు తప్ప. వీరబ్రహ్మం లేడు, ఎడ్ల బళ్ళు తయారుచేసే వాళ్ళు లేరు. ఆ బండ్లే లేవు. ఎడ్లూ లేవు. నాటి మగ్గాలు లేవు, బట్టలు నేసేవాళ్ళు లేరు. చిన్ని రాములు కొట్టు లేదు. షట్టర్లు కలిగిన దుకాణాలు వచ్చాయి. కుండల తయారీ లేదు. స్టీలు సామాను, ఫ్రిజ్ లు గృహప్రవేశం చేసాయి.

తెలుగు పల్లె పిలుస్తోంది! - It's my world and my life... కబుర్లు.. కాలక్షేపంస్వయం సమృద్ధి కాకపోయినా స్వయం పోషకంగా వుండే మా ఊరు ఇప్పుడు అన్ని ఊళ్లలో ఒక ఊరు. అంతే!
పాస్ పోర్టులో నేటివ్ ప్లేస్ కాలం పూర్తి చేయడానికి మాత్రం పనికి వస్తోంది.
– భండారు శ్రీనివాసరావు

Related posts