telugu navyamedia
సినిమా వార్తలు

60 సంవత్సరాల “దాగుడు మూతలు”

నందమూరి తారకరామారావు గారు నటించిన సాంఘిక చిత్రం .బి.ఎన్ ప్రొడక్షన్స్ వారి “దాగుడు మూతలు”
21 ఆగస్టు 1964 విడుదలయ్యింది.

నిర్మాత డి.బి.నారాయణ గారు డి.బి.ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు..

ఈ చిత్రానికి కథ, మాటలు: ముళ్ళపూడి వెంకటరమణ, స్క్రీన్ ప్లే: ఆదుర్తి సుబ్బారావు, పాటలు: ఆత్రేయ, దాశరథి, ఆరుద్ర, సంగీతం: కె.వి.మహదేవన్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పి.ఎల్.రాయ్, కళ: ఎస్.కృష్ణారావు, నృత్యం: హీరాలాల్, ఎడిటింగ్: టి. కృష్ణమాచారి, అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, బి.సరోజాదేవి, గుమ్మడి, సూర్యకాంతం, నాగయ్య, పద్మనాభం, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, పేకేటి శివరాం, రావి కొండలరావు, మల్లాది, శారద, రాధా కుమారి తదితరులు నటించారు.

ప్రఖ్యాత సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ గారి సంగీత సారధ్యంలో వెలువడిన పాటలన్నీ హిట్ అయ్యాయి.
“గోరొంక గూటికే చేరావో చిలకా”
“అడగక యిచ్చిన మనసే మద్దు”
“గోరొంక కెందుకో కొండంత అలక”
“ఎంకొచ్చిందోయ్ మావా,ఎదురొచ్చిందోయ్”
“మెల్లమెల్లమెల్లగా,అణువణువు నీదెగా”
“అందలం ఎక్కాడమ్మా అందకుండ పోయాడమ్మా”
“దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం”
వంటి పాటలు శ్రోతలను అలరించాయి.

ఎన్టీఆర్ గారు, దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఇది.

ఈ చిత్ర నిర్మాత డి.బి.నారాయణ 1961 లో ఎన్.టి.రామారావు గారు కథానాయకుడు గా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఒక సినిమా నిర్మాణం చేపట్టాలని రచయిత ముళ్లపూడి వెంకటరమణ తో కథను రెడీ చేసుకున్నారు.

కానీ ఈ దాగుడు మూతలు చిత్రం కోసం దాదాపు నాలుగు ఏళ్ళు వేచి చూసిన పిదప 1964 లో ఈ సినిమాను పూర్తిచేసి విడుదల చేయటం జరిగింది..

సహజంగా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారి తో ఎక్కువ సినిమాలకు పనిచేశారు.

కాగా ఎన్టీఆర్ గారి తో ఆదుర్తి పనిచేసిన సినిమాలు కేవలం రెండు చిత్రాలు మాత్రమే, “దాగుడు మూతలు, తోడూ నీడా”. ఈ రెండు సినిమాలు విజయవంతమైన చిత్రాలు కావటం విశేషం.

ఎన్టీఆర్ గారు నటించిన సినిమాలు ఎక్కువగా విజయా డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదల కావటం జరిగేది..

కాగా ఈ దాగుడు మూతలు చిత్రం మాత్రం శ్రీ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదలైంది. ఈ చిత్రం ఘన విజయం సాధించి విడుదలైన దాదాపు అన్ని కేంద్రాలలో 50 రోజులు, మూడు కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది.

1) విజయవాడ – లక్ష్మీటాకీస్ (105 రోజులు)
2) రాజమండ్రి – స్వామీ ధియేటర్ (100 రోజులు)
3) హైదరాబాద్ – బసంత్ లో 70 రోజులు + షిఫ్ట్ విజయలక్ష్మి (అమీర్ పేట్)- (100 రోజులు) థియేటర్లలో శతదినోత్సవం జరుపుకున్నది..

Related posts