వచ్చే నెల 2వ తేదీ నుంచి కొత్త పేరుతో పేదలకు రూ. 5కే భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. భోజనం సరఫరా చేసే అక్షయపాత్ర ప్రతినిధులకు ఈ మేరకు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందింది. గత నెల 31న అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసివేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, ముఖ్యమైన పట్టణాల్లో అన్న క్యాంటీన్లను టీడీపీ సర్కారు ఏర్పాటు చేసిందన్న సంగతి తెలిసిందే.
గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంటీన్లు మూసివేత తరువాత ప్రజల నుంచి నిరసన వ్యక్తం కాగా, పునరాలోచనలో పడిన ప్రభుత్వం తిరిగి వీటిని తెరిపించాలని నిర్ణయించుకుంది. అక్టోబర్ 2 నుంచి క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ అధికారులకు, అక్షయపాత్ర ప్రతినిధులకు ఆదేశాలు అందినట్టు సమాచారం.