telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ : .. రివర్స్ టెండరింగ్ తో .. 58 కోట్ల ఆదా ..

58 crores saved on reverse tendering

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ మంచి ఫలిలాలను ఇస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా పోలవరం ప్రాజెక్ట్‌లోని 65 ప్యాకేజీల పనికి టెండర్ పిలవగా అంచనా వ్యయం కన్నా 15.6 శాతం తక్కువకే కోట్ అయ్యింది. దీంతో మొత్తం పని విలువలో రూ. 58 కోట్ల తక్కువకు హైదరాబాద్‌కు చెందిన మ్యాక్స్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ ఎల్-1గా బిడ్ దాఖలు చేసింది. గత టీడీపీ ప్రభుత్వంలో ఇదే ప్యాకేజీని రూ.276 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగించగా దానిని రద్దు చేసిన జగన్ సర్కార్ అదే పనికి రివర్స్ టెండరింగ్ ద్వారా మ్యాక్స్ ఇన్ఫ్రా సంస్థ 231 కోట్లకు బిడ్డింగ్ దాఖలు చేసింది. రివర్స్ టెండరింగ్ పద్ధతి ద్వారా కేవలం రూ.300 కోట్లు విలువ చేసే పనిలోనే ఇంత ఆదా అయ్యిందంటే భవిష్యత్తులో ఖరారు కానున్న హైడల్, హెడ్ వర్క్స్‌కి సంబంధించిన పనుల్లో చాలా డబ్బులు ఆదా అయ్యే అవకాశం ఉంది.

రివర్స్ టెండరింగ్ ఈ- ఆక్షన్ పద్ధతిలో నిర్వహించారు. ఇందులో ఆరు కంపెనీలు పోటీపడ్డాయి. అవి ముంబైకి చెందిన పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్, హైదరాబాదుకు చెందిన మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్, హైదరాబాదుకే చెందిన మరో సంస్థ మ్యాక్స్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ , ముంబైకి చెందిన ఆఫ్‌కాన్స్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్స్ లిమిటెడ్, హైదరాబాదుకు చెందిన ఎంఆర్‌కేఆర్ ఎస్‌ఎల్‌ఆర్ జేవీ, మరో హైదరాబాద్ సంస్థ ఆర్ఆర్‌సీఐఐపీఎల్-డబ్ల్యూసీపీఎల్ కన్సోర్టియం సంస్థలు ఉన్నాయి. దాదాపు మూడు గంటల పాటు ఈ-ఆక్షన్ నిర్వహించారు. అత్యంత తక్కువకు బిడ్ వేసిన సంస్థ అర్హతలను పరిశీలించి పనులు అప్పగించే అవకాశం ఉంది. మ్యాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ అత్యంత తక్కువకే బిడ్ దాఖలు చేయడంతో ఆసంస్థకే పనులు అప్పగించనుంది ప్రభుత్వం. దేశంలో ఎక్కడాలేని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ చేపట్టడం ఇదే తొలిసారి. కాంట్రాక్టు విలువ కంటే అత్యంత తక్కువ ధరకు టెండర్ ఖరారు కావడంతో దీనివల్ల పెద్ద మొత్తంలో నిధులు ఆదా అయ్యాయని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. మొత్తం మీద రూ.58.53 కోట్లు ఆదా అయినట్లు ఆయన చెప్పారు.

Related posts