రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై ఆందోళలు కొనసాగుతున్నాయి. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు నిరసనగా ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాలు సచివాలయం ముట్టడికి యత్నించాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంత్రి జగదీశ్ రెడ్డిని బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం 17 మంది విద్యార్థులు చనిపోయినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఫలితాల్లో అవకతవకలకు కారణమైన గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థి సంఘాల ఆందోళనతో సచివాలయం దగ్గర భారీగా పోలీసులు మొహరించారు. ఆందోళనకారులను అడ్డుకోవడంతో పోలీసులకు, విద్యార్థి సంఘాల నేతలకు మధ్య తోపులాట జరిగింది. సుమారు 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
మొత్తానికి దీనిని రాజకీయం చేసిన విపక్షాలు, కేసీఆర్ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక వీడియోలో రేపటి ఎన్నికలలో తామే ఓటువేయాల్సింది, ఆలోచించాలని ఓ విద్యార్థి చెప్పిన మాటలు .. విపక్షాలు సహా తెరాస కూడా బాగా సీరియస్ గానే తీసుకున్నట్టుగా ఉన్నాయి. దీనితో ఇది విద్యాపరమైన అంశం కాస్తా, కేసీఆర్ పై మచ్చగా మార్చే యత్నంలో రాజకీయం అయిపోయింది.