telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

తూర్పుగోదావరి : .. మూడోరోజు ప్రయత్నం కూడా .. విఫలమే…

3rd day operation vasista stopped due to rain

జిల్లా లో భారీగా వర్షం కురుస్తుండటంతో మూడో రోజు కూడా ఆపరేషన్ వశిష్టకు ఆటంకం ఏర్పడింది. భారీ వర్షంతో బోటు వెలికితీత పనులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఒక్క లంగర్‌తో బోటును వెలికితీసే ప్రయత్నం చేసి విఫలం కావడంతో.. రెండు లంగర్లతో బోటును బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఒక్క ఐరన్ రోప్‌తో తెగిపోయే ప్రమాదం ఉండటంతో రెండు ఐరన్ రోప్స్ లంగర్లకు కట్టి ఒడ్డున ఉన్న క్రెయిన్‌లతో బోటును వెలికి తీసేందుకు ధర్మాడి సత్యం టీం తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో వెలికితీత పనులకు బ్రేక్ పడింది. ఆపరేషన్ రాయల్ వశిష్టలో మొదటి రోజంతా బోటును వెతకడానికే సరిపోయింది. బోటు మునిగిన ప్రాంతంలో దాదాపు 2వేల మీటర్ల వెడల్పుతో రోప్స్‌ను నీళ్లలోకి దించింది సత్యం బృందం. పంట్ సాయంతో గాలింపు చేపట్టారు. మధ్యాహ్న సమయంలో రోప్‌కి లింక్ చేసిన లంగర్ బోటును తాకి దానికి పట్టేసింది. గోదావరిలో 200 అడుగుల లోతులో ఇసుకలో కూరుకుపోయిన బోటుకు లంగర్ తగిలింది. నెమ్మదిగా బోటును కదిలించడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అప్పటికే సాయంత్రం కావడంతో మొదటి రోజు బోటు ఆపరేషన్‌ను ఆపేశారు.

రెండో రోజు ధర్మాడి సత్యం టీం చేసిన తొలి ప్రయత్నం విఫలమైంది. లంగర్‌కు లింకు ఉన్న ఐరన్ రోప్‌ను ఒడ్డున ఉన్న జేసీబీకి లింక్ చేశారు. జేసీబీ సాయంతో బోటును లాగేందుకు ప్రయత్నించారు. అయితే.. మధ్యలో రోప్‌ తెగిపోయింది. రోప్‌ తెగిపోవడంతో ఆపరేషన్‌ వశిష్టకు తాత్కాలికంగా ఆటంకం ఏర్పడింది. దీంతో పాటు.. అనుకూల వాతావరణం కూడా ఆపరేషన్‌కు అడ్డంకిగా మారింది. 17 రోజుల క్రితం నీటిలో మునిగిపోయిన బోటుని మట్టి, ఇసుక కమ్మేసిందని.. బురదలో కూరుకుపోవటం వల్లనే బోటు కదల్లేని పరిస్థితుల్లో రోప్‌ తెగిపోయిందని తేలింది. అయితే మునిగిన బోటును పైకి తెచ్చేవరకు తమ ఆపరేషన్‌ కొనసాగుతుందని ధర్మాడి సత్యం టీం చెబుతోంది. ఈ రోజు వర్షం కారణంగా ఆపరేషన్ మధ్యలోనే ఆగిపోయింది. ఈ ప్రమాదంలో మిస్సైన బాధితుల కుటుంబసభ్యులు ఇప్పటికే ఆశలు వదిలేసుకున్నారు. కొంతమంది అయితే తమ వారి మృతదేహాలు బయటికి రాకపోవడంతో.. అంత్యక్రియలు కూడా జరిపించారు.

Related posts