telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

కోతుల కోసం 350 ఎకరాలలో .. పండ్ల తోట.. : ఒడిశా అటవీశాఖ

350 acres fruit plants for monkey shelter in odisha

మనిషి తన అవసరాల కోసం విచక్షణారహితంగా అడవులను నరికివేస్తున్నాడు. దీనితో అడవులలో ఉన్న జీవరాశికి అటు పోషణ, ఇటు ఉండేందుకు ఆవాసాలు కరువై జనావాసాలలోకి వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు రోజు చూస్తూనే ఉన్నాము. అయితే ఒడిశాలో భవానీపట్న-లాంజిగర్‌ రహదారిలో వాహన రద్దీ ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో వేలాది వానరసైన్యం రోడ్ల మీదే అటూఇటూ తిరుగుతూ కనిపిస్తుంది. అలా రోడ్డు దాటేటప్పుడు వాహనాల కింద పడి అవి మృత్యువాత పడిన ఘటనలెన్నో ఉన్నాయి. దీనికి పరిష్కారం కోసం ఆలోచించిన ఒడిశా అటవీ శాఖ అధికారులు, అవి ఎందుకు జనావాసాల్లోకి, గ్రామాల దగ్గరకు, రోడ్ల మీదకు వస్తున్నాయని పరిశీలించారు. వారికి కనిపించిన ఒకే కారణం అడవుల విస్తీర్ణం తగ్గిపోతుండడమే. ఉన్న కొద్దిపాటి అడవుల్లోనూ వాటికి ఆహారం లభించడం లేదు.

దీనితో ఆ రాష్ట్ర అటవీశాఖ అధికారులు, బిస్వంత్‌పూర్‌కి దగ్గరలో నాలుగు సంవత్సరాల క్రితం 40 హెక్టార్లలో అటవీశాఖ పండ్ల మొక్కలు నాటించింది. ఆ చెట్లకు కాసిన కాయలు, పండ్లు ఆ చుట్టుపక్కల గ్రామాలు, రోడ్లపై తిరుగుతున్న కోతులను ఆకర్షించాయి. నాటి నుంచీ ఈ చెట్లే ఆ కోతులన్నిటికీ ఆవాసాలుగా మారాయి. ఈ విధానం మంచి ఫలితాలివ్వడంతో ఈ కార్యక్రమాన్ని పెద్దయెత్తున చేపట్టేందుకు అటవీ శాఖ సిద్ధమైంది. 350 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 5 లక్షల మొక్కలను నాటించేందుకు కార్యచరణ మొదలుపెట్టింది. వీటిలో 1.5 లక్షల పండ్ల మొక్కలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. రానున్న మూడు, నాలుగు సంవత్సరాల్లో ఈ చెట్లన్నీ కోతులకు నివాసం, ఆహారం అందించేందుకు సిద్ధమవుతాయి.

Related posts