telugu navyamedia
క్రీడలు వార్తలు

బుకీలను అరెస్ట్ చేసిన పోలీసులు…

మూడు మ్యాచుల సిరీసులో భాగంగా పూణే నగరంలోని ఎంసీఏ స్టేడియంలో శుక్రవారం భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగి రెండో వన్డే మ్యాచ్ సందర్భంగా బెట్టింగులకు పాల్పడిన 35 మంది బుకీ ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పింప్రీ చించ్ వాద్ పోలీసు కమిషనర్ కృష్ణ ప్రకాష్ ఓ ప్రకటనలో చెప్పారు. ఎంసీఏ స్టేడియంలోనే అందరిని అరెస్ట్ చేసినట్టు ఆయన తెలిపారు. బెట్టింగు ముఠా సభ్యులైన బుకీ ఏజెంట్లు భారత్-ఇంగ్లండ్ రెండో వన్డే మ్యాచ్ వివరాలను ఎంసీఏ స్టేడియం నుంచి కంట్రోల్ రూంకు అందిస్తున్నారని పూణే పోలీసులు తెలిపారు. ప్రతి డెలివరీ ఫలితం గురించి వారు కంట్రోల్ సెంటర్‌లో తమ సహచరులకు సమాచారం పంపించారట. వికెట్, ఓవర్, బౌండరీల వివరాలు అందించారట. మ్యాచ్ రిజల్ట్ చెపుతుండగా పోలీసులు 35 మందిని అరెస్టు చేశారు. బుకీల అరెస్టుతో క్రికెట్ బెట్టింగ్ బాగోతం బట్టబయలైంది. గత ఏడాది గురుగ్రామ్‌లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగులకు పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేశారు. ఇక శుక్రవారం టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 337 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ 43.3 ఓవర్లలలో సునాయాసంగా ఛేదించింది.

Related posts