దేశంలోని మధ్యతరగతి ప్రజలకు ఆయుష్మాన్ భారత్ తరహాలో రూ.300 ప్రీమియం చెల్లింపుతో కొత్తగా ఆరోగ్య సంరక్షణ పథకాన్ని అమలు చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త హెల్త్ స్కీంకు నీతి ఆయోగ్ రూపకల్పన చేసింది. దేశంలో 50 శాతం ఉన్న మధ్యతరగతి ప్రజలు కేవలం 300రూపాయల ప్రీమియం చెల్లించి మెరుగైన వైద్యసేవలు పొందేందుకు వీలుగా ఈ కొత్త హెల్త్ స్కీంను రూపొందించారు. దేశంలోని పేదలైన 40 శాతం మంది ప్రజలకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉచిత వైద్యం అందిస్తున్నారు.
దేశంలో అధిక ఆదాయవర్గాలైన పదిశాతం మంది వైద్యం కోసం డబ్బు చెల్లించగలరు. కాని మధ్యతరగతికి చెందిన మరో 40 శాతం మందికి నామమాత్రపు ప్రీమియంతో వైద్యసేవలు అందించేలా దేశంలో 1.5 లక్షల ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కేంద్రాల్లో బీపీ, మధుమేహం, కేన్సర్ తదితర వ్యాధులకు చికిత్స చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా నీతిఆయోగ్ ఉపాధ్యక్షులు రాజీవ్ కుమార్, నీతిఆయోగ్ ఆరోగ్య సలహాదారు అలోక్ కుమార్ లు రూపొందించిన నివేదికను తాజాగా విడుదల చేశారు.