telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గ్రామాలలో మాస ప్రణాళిక .. నేటినుండే ప్రారంభం..

30 days village development scheme from today

నేటి నుండే తెలంగాణ ప్రభుత్వం పతిష్టాత్మకంగా చేపట్టనున్న గ్రామాల్లో ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమం మొదలుకానుంది. రాబోయే రెండు మూడు నెలలు గ్రామాల్లో మార్పు తేవడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. 30 రోజులపాటు గ్రామాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి కార్యచరణ రూపొందించనున్నారు. పల్లెల రూపురేఖలు మార్చే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. తెలంగాణలోని అన్ని గ్రామాలను అభివృద్ధి బాట పట్టించేందుకు కొత్త కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలకు గ్రామస్థాయిలోనే ప్రణాళిక రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్లు, జిల్లా అధికారులు, మండల పరిషత్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇప్పటికే సీఎం కెసిఆర్ దిశా నిర్దేశం చేశారు.

అధికారులు కూడా నేటి నుంచి గ్రామాల బాట పట్టనున్నారు. గ్రామసభ నిర్వహించి ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం చర్యలు చేపట్టనున్నారు. వార్షిక, పంచవర్ష ప్రణాళికలను సిద్ధం చేసి గ్రామాలను అభివృద్ధి చేయనున్నారు. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వ నిధులకు తోడు.. మరిన్ని నిధులను కేసీఆర్ సర్కార్ మంజూరు చేయనుంది. ఈ కార్యక్రమంలో పచ్చదనం పరిశుభ్రతకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది. హరితహారం కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.నెల రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో దృష్టి సారించాల్సిన అంశాలను ప్రభుత్వం గుర్తించింది. ప్రజలు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ చేపట్టాల్సిన కార్యక్రమాలను ఖరారు చేసింది. లక్ష్యాన్ని సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్న సీఎం.. అలసత్వం, అజాగ్రత్త వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ లు కూడా గ్రామ ప్రత్యేక కార్యచరణలో పాల్గొనాలని ఆదేశించారు.

Related posts