telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ప‌త్తి రైతుల స‌హాయార్థం 293 మిల్లులు…

దీపావ‌ళి పండుగ త‌రువాత, సోమ‌వారం నుండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 293 జిన్నింగ్ & స్పిన్నింగ్ మిల్లులు ప్రారంభం కానున్నాయని, ప‌త్తి రైతుల స‌హాయార్థం అన్ని ప్రాంతాల‌లో ప‌త్తి సేక‌ర‌ణ కేంద్రాలు కాట‌న్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా ఆధ్వ‌ర్యంలో ప‌నిచేస్తాయ‌ని, చివ‌రి క్వింటాలు వ‌ర‌కు సిసిఐ ద్వారా కొనుగోలు ఉంటుంద‌ని, దాని కోసం తగు ఆదేశాలు జారీ చేశామ‌ని కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి శ్రీ జి. కిష‌న్ రెడ్డి తెలిపారు. గురువారం క‌వాడిగూడ, కేంద్ర ప్ర‌భుత్వ కార్యాల‌యాల స‌ముదాయంలో.. సిసిఐ, నాఫెడ్‌, ఎఫ్‌సిఐ, తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ అధికారులతో జ‌రిగిన స‌మీక్షా స‌మావేశం అనంత‌రం, పత్రికా సమాచార కార్యాలయం డైరెక్టర్ జనరల్ శ్రీ వేంకటేశ్వర్ తో కలిసి కేంద్ర‌ మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు.

ప‌త్తి సేక‌ర‌ణ విష‌యంలో నిర్ల‌క్ష్యపూరితంగా వ్యవహరించే అధికారుల‌ప‌ట్ల క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సిసిఐ, డిజిఎమ్, అమ‌ర్‌నాథ్ రెడ్డిని కేంద్ర మంత్రి ఆదేశించారు. రైతుల‌కు పూర్తి లాభ‌సాటి ధ‌ర ల‌భించేట‌ట్లు ప‌త్తి సేక‌ర‌ణ ఉండాల‌ని, ద‌ళారుల, ప్రైవేటు వ్యాపార‌స్తులను అనుమ‌తించ‌రాద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. రైతులు మార్కెట్ కు తీసుకువ‌చ్చే ప‌త్తిలో తేమ శాతం త‌క్కువ‌గా ఉండేట‌ట్లు రైతులకు క‌ర‌ప‌త్రాల ద్వారా సిసిఐ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేపడుతోందని మంత్రి అన్నారు. ఆధార్ ఆధారిత న‌గ‌దు బ‌దిలీని ప‌త్తి సేక‌ర‌ణ‌లో ఉప‌యోగిస్తున్నామ‌ని, పార‌ద‌ర్శ‌కంగా కొనుగోలు ప్ర‌క్రియ ఉంటుంద‌ని మంత్రి తెలిపారు. ప్ర‌తి సేక‌ర‌ణ కేంద్రంలో తేమ శాతాన్ని కొలిచే యంత్రాన్ని అందుబాటులో ఉంచాల‌ని అధికారుల‌కు సూచించారు. తద్వారా ఎటువంటి జాప్యం లేకుండా కొనుగోలు ప్ర‌క్రియ జ‌రుగుతుంద‌ని మంత్రి శ్రీ కిషన్ రెడ్డి అన్నారు. గ‌త ఏడాది కంటే ఈ సంవ‌త్స‌రం ప‌త్తి దిగుబ‌డి త‌గ్గే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌ల‌తో రైతుల‌కు పూర్తి మ‌ద్ద‌తు ధ‌ర చెల్లించి కొనుగోలు చేస్తామని మంత్రి తెలిపారు. తొంద‌ర‌ప‌డి త‌క్కువ ధ‌ర‌కు ప్రైవేట్ వ్యాపార‌స్తుల‌కు ప‌త్తిని అమ్మవద్దని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా రైతులని కోరారు.

వ‌రి పంట‌కు సంబంధించి కేంద్ర మంత్రి ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా అధికారుల‌తో స‌మీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేర‌కే తెలంగాణ రాష్ట్రంలో అధిక సంఖ్య‌లో రైతులు స‌న్న‌రకాలు వ‌రిని పండించార‌ని, దానిని పూర్తిగా రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే సేక‌రిస్తుంద‌ని చెప్పార‌ని గుర్తు చేశారు. కానీ, ప్ర‌స్తుతం ఆ ధాన్యాన్ని కొనే ప‌రిస్థితి లేద‌ని, దీనికి రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త తీసుకొని, రైతులకు న్యాయం చేయాలని అన్నారు. ఎఫ్‌సిఐ కి సంబంధించి దేశ‌వ్యాప్తంగా వ‌రిని సేక‌రించే విధానంలో ఏక‌రీతి ఉంటుంద‌ని, రాష్ట్రాల‌కు ప్ర‌త్యేకంగా ఎటువంటి నిబంధ‌న‌లు లేవ‌ని మంత్రి అన్నారు. ఆహార భ‌ద్ర‌తా చ‌ట్టం అమ‌లుకోసం సేక‌రించే ధాన్యం విష‌యంలో ఎటువంటి బేధాలు ఉండ‌వ‌ని, కేవ‌లం నాణ్య‌త‌ను అనుస‌రించి క‌నీస మద్దతు ధ‌ర చెల్లించి ఎఫ్‌సిఐ వరిని సేక‌రిస్తుంద‌ని మంత్రి అన్నారు. తెలంగాణాలో రైతులు పండించిన స‌న్న‌ర‌కాల వ‌రిని సేక‌రించాల‌ని రాష్ట్ర ప్రభుత్వాన్ని శ్రీ కిషన్ రెడ్డి కోరారు. అలాగే, బోన‌స్ కూడా చెల్లిస్తామ‌ని ముఖ్య‌మంత్రి చెప్పిన విష‌యం గుర్తు చేస్తూ, ప్ర‌స్తుతం దానిని అమ‌లు చేయాల‌ని అన్నారు.

నేష‌న‌ల్ కోప‌రేటివ్ డెవెల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (ఎన్‌సిడిసి) ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వానికి చెందిన అనేక ప‌థ‌కాల‌కు, కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్న విషయాన్ని శ్రీ కిష‌న్ రెడ్డి గుర్తు చేశారు. గొర్రెల కొనుగోలు, చేప‌ల పెంపకం, ఇత‌ర స‌హ‌కార సంస్థ‌ల‌కు త‌క్కువ వ‌డ్డీతో రుణాలు మంజూరు వంటి అనేక ప‌థ‌కాల‌కు ఎన్‌సిడిసి స‌హాయం చేస్తోందని పేర్కొన్నారు. కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రితో చ‌ర్చించి రాష్ట్రంలో మ‌రిన్ని ప‌థ‌కాల‌కు స‌హాయం అందేట‌ట్లు చూస్తాన‌ని మంత్రి అన్నారు.

ఇటీవ‌ల కేంద్రం తీసుకువ‌చ్చిన నూత‌న వ్య‌వ‌సాయ‌ చ‌ట్టాలు రైతుల‌కు మ‌రింత మేలు చేసే విధంగా ఉన్నాయ‌ని, అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు వీటిని అమ‌లుచేసి, రైతుల‌కు ల‌బ్ధి చేకూర్చాల‌ని కిషన్ రెడ్డి కోరారు. రాబోయే రెండు సంవ‌త్స‌రాల కాలంలో ఈ చ‌ట్టం వ‌ల్ల రైతు ఉత్ప‌త్తుల‌కు డిమాండు పెరుగుతుంద‌ని హోంశాఖ మంత్రి పేర్కొన్నారు. ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం పంట ఉత్ప‌త్తుల‌ను విదేశాల‌కు ఎగుమ‌తి చేసే విధంగా అనేక చ‌ర్య‌లు తీసుకుంటోందని కిషన్ రెడ్డి తెలిపారు. నిన్న ప్ర‌క‌టించిన ఉత్ప‌త్తి ఆధారిత ప్రోత్సాహ‌క ప‌థ‌కం వ‌ల్ల ఆహార శుద్ధి (ఫుడ్ ప్రాసెసింగ్‌) ప‌రిశ్ర‌మ‌ల‌కు లబ్ధి చేకూరుతుంద‌ని తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం క‌రోనా క‌ష్ట‌కాలంలో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిన పెట్టేందుకు, ప్ర‌జ‌ల‌కు మేలు క‌లిగించేందుకు, గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రాంత యువ‌త‌కు ఉపాధి క‌ల్పించేందుకు అనేక చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ద‌ని, అందరూ వీటికి మద్దతు తెలపాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు.

Related posts