telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

23 మంది పిల్లల్ని రక్షించిన.. ఉత్తరప్రదేశ్ పోలీసులు …

23 children safe guard by UP police

ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ తెల్లవారుజామున బర్త్ డే పార్టీకని 23 మంది పిల్లల్ని ఇంటికి పిలిచి వారిని బందీగా చెరబట్టిన నేరగాడిని ఎట్టకేలకు ఎన్‌కౌంటర్ చేశారు. అనంతరం పోలీసులు పిల్లలందరినీ సురక్షితంగా కాపాడారు. గురువారం రాత్రి 11 గంటలపాటు సాగిన నేరగాడి వీరంగానికి పోలీసులు చరమగీతం పాడారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫరూకాబాద్‌ జిల్లాలోని ముహమ్మదాబాద్ పట్టణంలోని కార్తియా గ్రామానికి చెందిన సుభాష్‌ బాథమ్‌ అనే వ్యక్తి తన కూతురు పుట్టిన రోజు వేడుకకు రమ్మని 24 మంది పిల్లలను పిలిచి తన ఇంట్లో బంధించాడు. పిల్లలపై తుపాకీ గురిపెట్టి కాల్చి చంపుతానని బెదిరించాడు. గాల్లోకి కాల్పులు జరిపి.. పోలీసులపై బాంబులేసి భయోత్పాతం సృష్టించాడు. పిల్లల్ని కాపాడేందుకు ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నించిన పోలీసులు, గ్రామస్థులపై పలుసార్లు కాల్పులు జరపడటంతోపాటు హ్యాండ్ గ్రెనెడ్లు విసిరాడు.

దీంతో ఇద్దరు పోలీసులతోపాటు కొందరు గ్రామస్థులు గాయపడ్డారు.సుభాష్‌ బాథమ్‌ అనే వ్యక్తికి ఓ హత్యకేసులో జీవితఖైదు పడింది. ప్రస్తుతం పెరోల్‌ మీద బయటకొచ్చాడని పోలీసులు చెప్పారు. పిల్లల్ని బర్త్ డే పార్టీకి పిలిచి వారిని సెల్లార్‌లోని గదిలో కూర్చోబెట్టాడు. లోపల్నుంచి గడియలు వేసేసి, తాళాలు కూడా వేసి వారందరినీ బందీలుగా చేశాడు. ఆఖరికి తన భార్య, పిల్లలను కూడా చెరలో పెట్టాడు. ఎంతసేపటికీ తమ పిల్లలు తిరిగి రాకపోయేసరికి వీధిలోని కొందరి తండ్రులు అక్కడికొచ్చి వాకబు చేయబోయారు. సుభాష్‌ లోపలి నుంచే వారిని బయటకు తరిమేశాడు. పిల్లల గురించి మాట్లాడితే కాల్చిపారేస్తానని బెదిరించాడు. దీంతో ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ కమెండోలను రంగంలోకి దించి నేరగాడైన సుభాష్ ను కాల్చి చంపి పిల్లల్ని కాపాడామని అదనపు డీజీపీ పీవీ రామశాస్త్రి చెప్పారు. ఈ కాల్పుల్లో నేరగాడి భార్యకు కూడా గాయాలయ్యాయని, ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామని రామశాస్త్రి చెప్పారు.

Related posts