ప్రాణాంతక కరోనా వైరస్ మరింత ముదిరింది, మృతుల సంఖ్య 213కు చేరింది. చైనాలోని దాదాపు అన్ని ప్రావిన్స్‌ల్లోనూ కరోనా వైరస్ జాడ లభించాయి. గురువారం నాటికి 9692 కేసులు నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. వైరస్ సోకిన వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు పేర్కొంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 43 మరణాలు సంభవించాయని, 1982 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయినట్లు స్పష్టం చేసింది. కరోనా వైరస్ పరిధి పెరగటం ఆందోళన కలిగిస్తున్నట్లు ఆరోగ్య కమిషనర్ అధికారులు చెప్పారు. దీన్ని నియంత్రించడానికి అందుబాటులో ఎలాంటి మార్గాలు కనిపించట్లేదని, అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగిస్తున్నామని అన్నారు.
గురువారం ఒక్కరోజులోనే హ్యూబే ప్రావిన్స్‌లో 42 మంది మరణించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మరొకరు చెంగ్డు ప్రావిన్స్‌లో మృతిచెందినట్లు చెప్పారు. దీనితో హ్యూబే ప్రావిన్స్‌లో ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 201కి చేరింది. రాజధాని బీజింగ్, ఆర్థిక రాజధాని షాంఘై సహా, చోంగ్‌క్వింగ్, అన్హుయ్, ఫుజియన్, గ్వాంగ్‌డాంగ్, జియాంగ్షు, జియాంగ్ఝి, యున్నాన్ వంటి ప్రావిన్స్‌లల్లో కరోనా కేసులో పెద్ద సంఖ్యలో నమోదైనట్లు చెప్పారు. అమెరికా ప్రభుత్వం తాజాగా ట్రావెల్ అడ్వైజరీని ప్రకటించింది. చైనాకు రాకపోకలు సాగించదలిచిన అమెరికన్లు.. తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని, లేదా వాయిదా వేసుకోవాలని సూచించింది. చైనాలో కరోనా వైరస్ విస్తృతంగా ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోల ఎవరూ ఆ దేశానికి వెళ్లొద్దని వెల్లడించింది. అక్కడి పరిస్థితులు అదుపులోకి వచ్చిన తరువాతే.. చైనాకు వెళ్లేలా తమ ప్రయాణ ప్రణాళికలను రూపొందించుకోవాలని పేర్కొంది.