telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

రాణించిన భారత్.. బంగ్లాకు భారీ లక్ష్యం..

2019 world cup practice match india scored 360

30 నుండి ఆరంభం కానున్న ప్రపంచకప్‌ కోసం ప్రస్తుతం ప్రాక్టీస్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. నేడు బంగ్లాతో భారత్‌ మ్యాచ్ జరుగుతుంది. న్యూజిలాండ్‌ చేతిలో ఘోర పరాజయాన్ని మరిపించేలా ఆడింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వార్మప్‌లో మ్యాచ్‌లో భారీ స్కోరు చేసింది. స్ట్రోక్‌ ప్లేయర్‌ కేఎల్‌ రాహుల్‌ (108; 99 బంతుల్లో 12×4, 4×6), ఎంఎస్‌ ధోనీ (113; 78 బంతుల్లో 8×4, 7×6) అద్వితీయ శతకాలతో చెలరేగడంతో ప్రత్యర్థికి టీమిండియా 360 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ కాస్త ఆలస్యంగా ఆరంభమైంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. శిఖర్‌ ధావన్‌ (1; 9 బంతుల్లో) జట్టు స్కోరు 5 వద్దే ఔటయ్యాడు. మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (19; 42 బంతుల్లో 1×4) సైతం తడబడ్డాడు. జట్టు 50 వద్ద వెనుదిరిగాడు.

ఓపెనర్లు మళ్లీ తక్కువ పరుగులకే వెనుదిరగడంతో సారథి విరాట్‌ కోహ్లీ (47; 46 బంతుల్లో 5×4) నిలకడగా రాణించాడు. అర్ధశతకం ముంగిట సైఫుద్దీన్‌ వేసిన యార్కర్‌కు బలయ్యాడు. కేఎల్‌ రాహుల్‌ చాన్నాళ్ల తర్వాత అద్భుతమైన శతకంతో అలరించాడు. నాలుగో స్థానంలో విలువైన ఇన్నింగ్స్‌తో ఆశలు రేపాడు. ఎంఎస్‌ ధోనీతో చక్కని భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ రాణించడంతోనే 22 ఓవర్లకు 102/4తో ఉన్న స్కోరు 44 ఓవర్లకు 268/5కు చేరుకుంది. 4, 6 స్థానాల్లో ఆడిన ఇద్దరు ఆటగాళ్లు శతకాలు బాదడంతో భారత శిబిరంలో ఆనందం నిండింది. 40 బంతుల్లో అర్ధశతకం సాధించిన మహీ 73 బంతుల్లోనే శతకం చేశాడు. భారీ సిక్సర్లు బాదేశాడు. రాహుల్‌ నిష్ర్కమణ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్‌ పాండ్య (21; 11 బంతుల్లో 2×4, 1×6) మెరిశాడు. విజయ్‌ శంకర్‌ (2; 7 బంతుల్లో), దినేశ్‌ కార్తీక్‌ (7; 5 బంతుల్లో) విఫలమయ్యారు.

Related posts