ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. 2021 జూన్ నాటికి ప్రాజెక్టు మొత్తం పూర్తవుతుందని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం మంత్రులు అనిల్, కన్నబాబు మీడియాతో మాట్లాడారు. 2020 జూన్ నాటికి ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. 41.5 మీటర్ల ఎత్తులో కాఫర్ డ్యామ్ నిర్మిస్తే అందుకనుగుణంగా ముంపు ప్రాంతాల ప్రజలను తరలించాల్సి ఉందన్నారు.
ముంపు ప్రాంతంలోని 113 కాలనీల్లో 28 వేల కుటుంబాలను తరలించాలన్నారు. ఈ ఏడాది వరద వచ్చే సమయానికి ప్రస్తుత కాఫర్ డ్యామ్‌కు తగినట్లుగా 12 వేల మందిని తరలించాల్సి ఉందని అనిల్ వివరించారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తమ ప్రభుత్వం లేనిపోని హడావిడి చేయడం లేదన్నారు. అంచనాలు పెంపునకు సంబంధించి నిపుణులతో థర్డ్ పార్టీ కమిటీ వేశామని.. పోలవరం ప్రాజెక్టులోనూ ఆ కమిటీ ఆడిట్ నిర్వహిస్తుందని కన్నబాబు స్పష్టం చేశారు.