రోడ్డు ప్రమాదాలు దడపుట్టిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల రూపంలో సంభవిస్తున్న అకాలమరణాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వాహనదారులు వాటిని పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న వాహనాలు, మితిమీరిన వేగంతో వాహనాలు నడపడమే ప్రమాదాలకు ప్రాథమిక కారణాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. 2018లో 6,603 మంది మరణించగా 21,697 మంది క్షతగాత్రులయ్యారు. 2019లో 6,806 మంది మరణించగా, 22,265 మంది గాయపడ్డారు. 2019లో రోడ్డు ప్రమాద మరణాల్లో 3 శాతం పెరగడం ఆందోళనకరమేనని రోడ్డు రవాణా నిపుణులు అంటున్నారు. ఏడాది మొత్తం మీద రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తే రోజుకు 60 రోడ్డు ప్రమాదాలు, 18 మరణాలు, 61 మంది క్షతగాత్రులైన
ఘటనలు నమోదయ్యాయి. తెలంగాణ రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ విభాగం 2019 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు విడుదల చేసిన తాజా గణాంకాలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్‌లో మోటారు వాహన సవరణ చట్టం-2019 అమలు చేస్తారన్న ప్రచారం జరిగింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ జరిమానాలు విధించడంతో ప్రమాదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు భారీగా తగ్గాయి. ఫలితంగా అంతకుముందు నెలకు సగటున 540 మంది మరణాలు సంభవించగా.. సెప్టెంబర్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య సుమారు 350కి పడిపోవడమే ఇందుకు నిదర్శనం. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో చాలా రాష్ట్రాలతోపాటు తెలంగాణ కూడా దీన్ని అమలు చేయమని ప్రకటించింది. దీంతో అక్టోబర్‌లో తిరిగి మరణాల సంఖ్య ఎప్పట్లాగే 500 దాటింది. ఇదే చట్టం అమలు చేస్తారన్న ప్రచారం లేకపోయి ఉంటే మరో 200 వరకు పెరిగి, మరణాల సంఖ్య 7 వేలు దాటి ఉం డేవని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
ఏడాది మొత్తం మీద ట్రాఫిక్ ఉల్లంఘనలపై ట్రాఫిక్ పోలీసులు కొరఢా ఝళిపించారు. 25.02 లక్షల ఉల్లంఘనలకుగాను ఏకంగా రూ.121.30 కోట్ల జరిమానాలు విధించారు. నవంబర్‌లో రూ.100 కోట్లు దాటగా డిసెంబర్ నాటికి రూ.120 కోట్లకు చేరుకుంది. అంటే నెలకు రూ.10 కోట్లు చొప్పున చలానాలు విధించారు. రోడ్డు ప్రమాదాలకు ప్రాథమిక, ప్రధాన కారణం వేగం. ఈ విషయంలో ట్రాఫిక్ ఉల్లంఘనదారులు ఎవరూ తగ్గడం లేదు. కేసులకు వెరవడం లేదు. ఏడాది మొత్తం మీద 11.31 లక్షల ఓవర్ స్పీడ్ కేసులు నమోదవడమే ఇందుకు నిదర్శనం. వీరికి రూ.92.36 కోట్లు చలానాలు విధించారు. ఈ లెక్కన రోజుకు 3,100 కేసులు, నిమిషానికి 2 కేసుల చొప్పున నమోదయ్యాయి.
ప్రభుత్వ ప్రకటనల్లో తప్పుడు సమాచారం: లోకేశ్