telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

డెడ్ లైన్ దాటలేకపోయిన …. 160 మంది ఆర్టీసీ కార్మికులు..

Tsrtc increase salaries double duty employees

తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికల నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు కొందరు సమ్మె నుండి వెనుదిరిగారు. శనివారం(అక్టోబర్ 5) సాయంత్రం 6 గంటల లోపు 160 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరినట్లు యాజమాన్యం ప్రకటించింది. వీరిలో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు కండక్టర్లు, సూపర్‌వైజర్లు, ఆఫీస్ స్టాఫ్, మెకానిక్‌లు ఉన్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసినప్పటికీ కార్మిక సంఘాలు సమ్మెను కొనసాగించాలనే నిర్ణయించాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.

ప్రజలకు ఇబ్బందులు కలగని రీతిలో శాశ్వత విధానాలను రూపొందించే అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి పువ్వాడ అజయ్ వివరించారు. సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందని చెప్పారు. మూడు వేల నుంచి నాలుగువేల ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకుని నడిపించే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. అర్హులైన యువత, నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను స్వీకరించి బస్సులను నడిపేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసిందని మంత్రి తెలిపారు. తక్షణమే యువతకు శిక్షణ ఇచ్చి బస్సులను నడిపించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోందని పువ్వాడ అజయ్ వివరించారు. ఏడు వేల ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు ఇస్తామని మంత్రి తెలిపారు.

Related posts