ప్రపంచంలోనే ఖరీదైన కార్ల్‌మన్ కింగ్ బుల్లెట్‌ప్రూఫ్ ఎస్‌యూవీ…రూ.14 కోట్ల ఖరీదైన కార్బన్ ఫైబర్‌తో తయారైన ఈ కారు వజ్రాన్ని పోలిన డిజైన్‌తో పైకి చూస్తేనే మిగిలిన కార్లకన్నా చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఇక, మిలమిలా మెరిసే కాంతులతో ఖరీదైన లెదర్ అలంకరణలతో ఉండే దీని లోపలికి తొంగి చూస్తే చిన్నసైజు ఫైవ్‌స్టార్ హోటల్లోకి అడుగు పెట్టినట్లే ఉంటుంది. ఎనిమిది అడుగుల పొడవుతో విశాలంగా ఉండే ఈ కారు వెనక భాగంలో విలాసంగా ఉండే రెండే సీట్లుంటాయి. వీటిలో కూర్చుంటే ఎంతగా అలసిన శరీరమైనా సాంత్వన పొందుతుంది. ఇవి మసాజ్ చెయిర్లు కూడా మరి.
ఆ సీట్లలో వెనక్కు వాలి ఎదురుగా ఉన్న 45 అంగుళాల 4కె టీవీలో ఎంచక్కా నచ్చిన సినిమాలు చూడొచ్చు. దాహం వేస్తే టీవీ కిందే ఉండే ఫ్రిజ్‌లో నుంచి పానీయాలు తీసుకుని చల్లగా తాగొచ్చు. ఈ కారులో కాఫీ మెషీన్ కూడా ఉంటుంది. కారు రిమోట్‌లో ఓ బటన్ నొక్కితే చాలు, పక్కనే ఉన్న అర తెరుచుకుని గ్లాసులూ కాఫీ కప్పులూ బయటికి వస్తాయి. వాటిలో పోసి తమతో ప్రయాణించే అతిథులకీ అందించొచ్చు. ఇక, కారులోనూ ఆఫీసు పని చేసుకునేవారికోసం కుర్చీ హ్యాండిల్‌లోపల ల్యాప్‌టాప్ వర్కింగ్ టేబుల్‌తో సహా అమరి ఉంటుంది. బటన్ నొక్కగానే, అది పని చేసుకోవడానికి వీలుగా తెరుచుకుంటుంది. ఇవేకాదు, ప్లే స్టేషన్, ఎయిర్ ప్యూరిఫయర్ సిస్టం, మూసి తెరుచుకునే వీలున్న డైనింగ్ టేబుల్, విలువైన వస్తువులు దాచుకునేందుకు లాకర్… ఇలా కార్ల్‌మన్‌లోని సౌకర్యాలు ఎన్నో. అంతేనా… రెండు సీట్లుండే డ్రైవర్ క్యాబిన్‌కూ వెనక సీట్లకూ మధ్య పార్టిషన్ ఉంటుంది కాబట్టి వెనక ప్రయాణించేవారికి పూర్తి ఏకాంతం లభిస్తుంది.