జర్నలిస్ట్ నుంచి బిగ్ బాస్ విజేతగా జర్నీ..
బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టే వరకూ సన్నీ అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన తొలిరోజు నుంచే ఎంటర్ టైన్మెంట్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు.
1989 ఆగష్టు 17 ఖమ్మంలో జన్మించాడు సన్నీ. ఇతని అసలు పేరు అరుణ్ రెడ్డి. ఇంటర్ వరకూ ఖమ్మంలోనే చదివిన సన్నీ.. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో బీకాం పూర్తి చేశాడు. అయితే సినిమాలపై ఉన్న మక్కువతో ఇంట్లో తెలియకుండానే యాక్టింగ్ నేర్చుకున్నాడు. ఒకపూట కాలేజ్.. ఒక పూట యాక్టింగ్‌కి వెళ్లేవాడు. ఆ తరువాత మెల్లమెల్లగా జర్నలిజం ఫీల్డ్‌లోకి అడుగుపెట్టాడు. మొదట వీజేగా పనిచేసి.. జస్ట్ ఫర్ మెన్ అనే ఇంటర్వ్యూ కార్యక్రమంతో బుల్లితెరపై అడుగుపెట్టాడు. ఆ తరువాత ఫిల్మ్ అండ్ స్పోర్ట్స్ రిపోర్టర్‌గా ఏబీఎన్ ఛానల్‌లో పనిచేసి.. స్టార్ మ్యూజిక్‌కి వెళ్లాడు. ఆ పరిచయాలతో ‘కళ్యాణ వైభోగం’ అనే సీరియల్‌లో మెయిన్ లీడ్ సంపాదించి నటుడిగా నిరూపించుకున్నాడు. ఈ సీరియల్‌లో జయసూర్య పాత్రలో అదరగొట్టేశాడు సన్నీ. ఆ తరువాత కొన్ని అనివార్య కారణాలతో ‘కళ్యాణ వైభోగం’ సీరియల్ నుంచి తప్పుకున్నాడు.
ప్రస్తుతం సన్నీ.. ‘సకల గుణాభి రామ’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. EIPL పతాకంపై సన్నీ, ఆషిమా నర్వాల్, తరుణీ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. శ్రీతేజ్ కీలకపాత్రలో కనిపించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో.. సన్నీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే.. ప్రమోషన్స్ కార్యక్రమాలను పూర్తి చేసి డిసెంబర్ చివరి వారంలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.