లోక్‌సభ నుంచి 12 మంది టీడీపీ ఎంపీల పై సస్పెన్షన్ వేటు పడింది. సభ ప్రారంభంలోనే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ ఎంపీలు ఆందోళనకు దిగారు. వెల్‌లోకి దూసుకెళ్లి ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. తమ స్థానాలకు వెళ్లి కూర్చోవాలని చెప్పినా వినకపోవడంతో నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ సుమిత్రా ఆదేశాలు జారీచేశారు. టీడీపీ ఎంపీలతో పాటు ఆందోళన చేస్తున్న తొమ్మిది మంది అన్నాడీఎంకే ఎంపీలను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం సభను స్పీకర్ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. కాగా సభ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు సభలోనే ఉంటూ నిరసనను తెలియజేస్తున్నారు.
టీడీపీ నేతలు గల్లా జయదేవ్, మురళీ మోహన్, రామ్మోహన్ నాయుడు, తోట నరసింహం, బుట్టా రేణుక, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మాగంటి బాబు, శ్రీరామ్ మాల్యాద్రి, అశోక్ గజపతి రాజు, కొనకళ్ల నారాయణ, జేసీ దివాకర్ రెడ్డిపై స్పీకర్ ఈరోజు సస్పెన్షన్ వేటు వేశారు.గతంలో ఎంపీలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాగా జనవర 1 నుంచి వెల్‌లోకి వచ్చి నిరసన వ్యక్తం చేసే వారిని సస్పెండ్ చేయాలంటూ బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో సెక్షన్ 374ఏ ప్రకారం వెల్‌లోకి వచ్చి నిరసన వ్యక్తం చేసే వారిని నాలుగు లేదా ఐదు రోజుల పాటు సస్పెండ్ చేయాలంటూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు.