telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా పోరు : తెలంగాణకు భారీ సాయం చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ

కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) లో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి (11) క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను విరాళంగా ఇస్తామని మెయిల్ (మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్) హామీ ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ తెలిపారు. బ్యాంకాక్ నుండి IL.76 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా వచ్చిన 3 క్రయోజెనిక్ ట్యాంకర్లను స్వీకరించి ఆక్సిజన్ నింపడానికి ఒడిశాకు రైలులో వెళ్లే ట్యాంకర్లకు బేగంపేట వైమానిక దళం స్టేషన్ వద్ద శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఫ్లాగ్ అఫ్ చేశారు.

మొదటి బ్యాచ్‌గా 3 ట్యాంకర్లు హైదరాబాద్‌కు వచ్చాయని, బంగాళా ఖాతంలో అవాంతరాలు ఉన్నందున మిగిలిన ట్యాంకర్లు 3 నుండి 4 రోజుల్లో వస్తాయని ప్రధాన కార్యదర్శి తెలిపారు. గౌరవనీయ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సూచనల మేరకు, రాష్ట్రంలోని కోవిడ్ రోగులకు ఎటువంటి కొరత లేకుండా తగురీతిలో ఆక్సిజన్ సరఫరా కోసం అందరు అధికారులు కోవిడ్ వ్యాప్తి నివారణకు నిరంతరం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని, రాష్ట్రంలోని కోవిడ్ రోగులకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఆక్సిజన్ ప్లాంట్లు, స్టోరేజ్ యూనిట్ల నిర్మాణం, ట్యాంకర్ల సేకరణకు చర్యలు చేపట్టిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

Related posts