telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

నిజామాబాద్ నుండి.. వెయ్యి మంది రైతుల పోటీ.. !! రైతుల వినూత్న నిరసన..

1000 farmers from nijamabad to parlament

రైతే రాజు అనేది ఎన్నికల సమయంలోనే.. మిగిలిన సమయం అంతా వారు కనిపించరు. ఈ విషయం ఇప్పటికైనా రైతన్న స్పష్టంగా తెలుసుకున్నట్టుగా ఉన్నాడు. దీనితో తమ హక్కుల పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం తేలికగా తీసుకుంటోందనే ఉద్దేశంతో దేశ రాజధాని ఢిల్లీకి తమ గళం వినిపించేలా అన్నదాతలు సిద్ధమవుతున్నారు. మద్దతు ధర కోసం పసుపు, ఎర్రజొన్న రైతులు గత కొద్దిరోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీనితో నిజామాబాద్ పార్లమెంటరీ స్థానం నుంచి బరిలో నిలిచేందుకు వెయ్యి మంది రైతులు సన్నద్ధమవుతున్నారు. అన్నదాతలు తీసుకున్న ఈ నిర్ణయం.. స్థానిక ఎంపీ కల్వకుంట్ల కవితకు షాక్ గా పరిణమించింది.

ఇటీవల 20 రోజుల వ్యవధిలో నాలుగైదు సార్లు జాతీయ రహదారిపై నిరసనకు కూడా దిగారు. అయినా ప్రభుత్వం వారిని ఏమాత్రం పట్టించుకోలేదు. తాజాగా తలపెట్టిన ఛలో హైదరాబాద్ పాదయాత్రను కూడా పోలీసులు భగ్నం చేయడంతో.. వారు ఎన్నికల సమరానికి సై అంటున్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో దాదాపు 200 గ్రామాల నుంచి వెయ్యి మంది వరకు రైతులు పోటీచేయనున్నారని సమన్వయ కమిటీ ప్రకటించింది. పసుపు అధికంగా పండించే ఊళ్లకు సంబంధించి ఆయా గ్రామాభివృద్ధి కమిటీల నుంచి 5 వేల నుంచి 10వేల రూపాయల వరకు సేకరించి అభ్యర్థుల సెక్యూరిటీ డిపాజిట్లు చెల్లిస్తామంటున్నారు.

1996 లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీ స్థానంలో ఇలాంటి సంఘటనే ఎదురైంది. 537 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. చివరకు 480 మంది ఎన్నికల బరిలో నిలిచారు. అది రికార్డు సృష్టించడమే గాకుండా.. నాటి నుంచి నేటి వరకు అలాంటి ఘటన పునరావృతం కాలేదు. ఆ 480లో కూడా రైతులే ఎక్కువగా పోటీచేయడం గమనార్హం. శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ ద్వారా ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు సాగునీరు విడుదల చేయాలనే డిమాండ్ తో అన్నదాతలు దీక్షలు చేపట్టారు. అయితే అప్పటి ప్రభుత్వాలు కనికరించకపోవడంతో ఎన్నికల బరిలోకి దిగాల్సి వచ్చింది.

ఒకవేళ నిజంగానే వెయ్యి మంది పోటీచేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. పోటీచేసే అభ్యర్థుల సంఖ్య రెండంకెలు ఉంటేనే గందరగోళంగా ఉంటుంది. అలాంటిది వెయ్యి మంది పోటీచేస్తే.. గుర్తులు కేటాయించడం మొదలు ఈవీఎంల దాకా తలనొప్పి వ్యవహారమే.

Related posts