telugu navyamedia
క్రీడలు వార్తలు

రేపటి నుండే భారత ఆటగాళ్ల క్వారంటైన్….

ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, 5 టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత ఆటగాళ్ల క్వారంటైన్ రేపటి నుండి ప్రారంభం కానుంది. ఈ పర్యటనకు ఎంపిక చేసిన 24 మంది ఆటగాళ్లు ముంబైలోని ఓ హోటల్‌లో రెండు వారాల పాటు కఠిన క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఆ తర్వాత జూన్ 2న ఇంగ్లండ్‌కు పయనంకానున్నారు. మరోవైపు మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు.. ఓ టెస్ట్, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లనుంది. ప్రతి ఫార్మాట్‌కు 18 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. ఈ క్రమంలో పురుషుల, మహిళల జట్లు కలిసి ఒకే ఫ్లైట్‌లో ప్రయాణం చేయనున్నాయి. దాంతో మహిళా క్రికెటర్లు కూడా ముంబై వేదికగా హార్డ్ క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఇంగ్లండ్‌ చేరుకున్న తర్వాత మరో 10 రోజుల పాటు ఐసోలేషన్ పాటించనున్నారు. అయితే ఈ ఐసోలేషన్‌లో ఆటగాళ్లకు ప్రాక్టీస్ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. జూన్ 2న భారత జట్లు ఇంగ్లండ్‌ చేరనున్నాయి. 10 రోజుల ఐసోలేషన్‌ను జూన్ 12న పూర్తి చేసుకోనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లను, సహాయక సిబ్బందిని భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రత్యేక విమానంలో ముంబైకి తీసుకురానుంది. ఇక ముంబైలోనే ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, ఓపెనర్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రవిశాస్త్రి వచ్చే వారం హోటల్ ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో చేరనున్నారు. ఈ బబుల్‌లో మహిళా, పురుష క్రికెటర్లకు మూడు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.

Related posts