telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రియాపై మీడియా దాడి… బాలీవుడ్ ప్రముఖుల బహిరంగ లేఖ

Rhea

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతోంది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు సీబీఐ ఇన్వెస్టిగేషన్‌లో రియాను నిందితురాలుగా చేర్చి విచారణ జరుపుతున్నారు. అయితే రియా బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకుంది. కానీ కోర్టు రియాకు బెయిల్ నిరాకరించి 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. అయితే తాజాగా సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి పట్ల అనేక ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్న రియాపై మీడియా చేస్తున్న దాడిని ఖండిస్తూ నటి సోనమ్ కపూర్, దర్శకులు అనురాగ్ కశ్యప్, గౌరి షిండే, జోయా అక్తర్ సహా 2,500 మంది భారతీయ మీడియాకు బహిరంగ లేఖ రాశారు. దీనిపై సుమారు 60 ఆర్గనైజేషన్లు సంతకం చేశాయి. ఫెమినిస్ట్ వాయిస్ అనే బ్లాగ్‌లో ప్రచురితమైన ఈ లేఖలో “రియా చక్రవర్తి మీద కొనసాగుతున్న మీ వేటను చూస్తుంటే.. జర్నలిజం యొక్క నీతిని, మానవ మర్యాద, గౌరవాన్ని సిద్ధాంతాన్ని ఎందుకు విడిచిపెట్టారోననే అనుమానం కలుగుతోంది. అంతే కాకుండా మీ కెమెరాలతో ఒక యువతిపై శారిర దాడి చేయాలని ఎందుకు ఎంచుకున్నారో మాకు అర్థం కాలేదు. ‘రియాను బంధించండి’ అనే నాటకంతో తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆమె గోప్యతను దెబ్బతీస్తున్నారు. ఆమెపై సందేహాస్పద విచారణే కొనసాగుతోంది. దర్యాప్తు సంస్థలు ఆమె నిందితురాలని నిర్ధారించలేదు. చట్టం ప్రకారం.. ఆమెకు మిగతా వారికి ఉన్న హక్కులు ఉంటాయి. కానీ వాటిని దృష్టిలో పెట్టుకోకుండా ఆమెపై ఊహాజనితమైన కథనాల్ని రూపొందించడంలో మీరు నిమగ్నమయ్యారు. గతంలో మీరు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్‌ల పట్ల ఎలా వ్యవహరించారో ప్రపంచానికి తెలియనిది కాదు. వారి కుటుంబాలు, అభిమానులు, వృత్తి గురించి ఆలోచనలు జరిగాయి. కానీ నేరం చేసినట్లు ఇంకా నిరూపన కాని ఒక యువతి వ్యక్తిత్వాన్ని మీరు హతమారుస్తున్నారు. ఆమెను, ఆమె కుటుంబాన్ని కుటుంబాన్ని చంపడానికి ఆన్‌లైన్ గుంపును ప్రేరేపిస్తున్నారు. అనేక తప్పుడు డిమాండ్లకు ఆజ్యం పోశారు. యువతుల్ని చిన్న చిన్న కలలు సైతం కనకుండా ఈ ప్రపంచం నిరోధిస్తుంటుంది. వీలైతే వారిని ప్రపంచంలో వారిని స్వేచ్ఛగా ఉండనివ్వండి. ఎందుకో.. వారి నవ్వులు చాలా బిగ్గరగా వినబడతాయి. వారి స్వేచ్ఛ విచ్చిలవిడితనంగా కనిపిస్తుంది. మీడియాలో కూడా ఇలానే చూపిస్తున్నారు. వారి దు:ఖం నిజం కాదంటారు. వారి ప్రశ్నలు వారి ఆందోళనలు, వారి ఆశయాలు, వారి బట్టలు అన్ని పరిశీలనకు వస్తాయి. ఒక యువతిని బాధితురాలిగా చేయడం చాలా సులభం. ఎందుకంటే మహిళా స్వాతంత్ర్యం చాలా మందికి సంకుచిత ఆలోచనలు ఉంటాయి. నిజానికి మనకు కవాల్సింది ఇదేనా? ప్రస్తుతం తగ్గిన జీడీపీ, పెరిగిన కరోనా లాంటి అనేక సమస్యల గురించి వాస్తవాలు వెల్లడించడానికి బదులు ఇలాంటి చిన్న చిన్న అంశాలపై సమయం వృధా చేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో గృహహింసకు గురైన అనేక మంది మహిళలకు పోలీసుల్ని ఆశ్రయించే పరిస్థితులు లేవు. ఇలాంటి విషయాలను బహిరంగ పర్చడంలో మీరు (మీడియా) చేసిన కృషి ఏంటి? భారతదేశం ఇప్పటికే భయంకరమైన మానసిక ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మహిళా ఆత్మహత్యల్లో మూడింట ఒక వంతు ఇండియాలోనే జరుగుతున్నాయి. ఇవన్నీ వదిలేసి రియా ప్రియుడి మానసిక ఆరోగ్యాన్ని మాత్రమే ఎందుకు తీవ్రంగా పరిగణిస్తున్నారు? ఇది తటస్థ దృక్పథం కాదు.. సామాజిక హింస, నియంత్రణ. మీ మరుగుజ్జు కల్పనలు మహిళల దుర్బలత్వంపై దాడిలాంటివి. దేశంలోని మహిళలపై దాడులకు మీరు సందేశాల్ని పంపుతున్నారు. రియా చాలా పరిణితితో వ్యవహరించింది కాబట్టే మీ ఆటలో పూర్తిగా చిక్కుకోలేదు. రియా చక్రవర్తిపై దుర్మార్గమైన వేటను ఆపడానికి, మహిళల నైతికతపై కల్పనాత్మక కథనాలను నిలువరించడానికి, చెడ్డ స్త్రీలను సిలువ వేయండనే విధ్వేష వ్యాఖ్యల్ని అడ్డుకోవడానికి.. వీటన్నినీ ప్రచారం చేస్తున్న వార్తా మాధ్యమాన్ని ప్రశ్నించడానికి మేము ఈ లేఖ రాస్తున్నాము. సరైన, బాధ్యతాయుతమైన పని చేయమని అడగడానికి వ్రాస్తాము. మీరు వార్తల్ని వేటాడండి. మహిళల్ని కాదు” అంటూ మీడియాకు బహిరంగ లేఖ రాశారు.

Related posts