telugu navyamedia
తెలంగాణ వార్తలు

బైబై గణేశా..గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపయ్య..

తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి పొందిన ఖైరతాబాద్​ పంచముఖ మహాగ‌ణ‌ప‌తి నిమజ్జనం పూర్తి అయింది.తొమ్మిది రోజుల పాటు భక్తుల విశేష పూజలు అందుకున్న గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకున్నాడు .

భక్తజనుల కోలాహలం మహా గణపతి శోభాయాత్ర మధ్య ఎంతో ఘనంగా శోభాయమానంగా జరిగింది. గణపతి బప్పా మోరియా నినాదాలతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి.

శుక్రవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ఎన్టీఆర్ మార్గ్ లో క్రేన్ నం. 4 వద్ద బడా గణేశ్ నిమజ్జనం చేశారు. భారీ గణపతికి వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలు భక్తులు తరలివచ్చారు.

భక్తుల కోలాహాలం మధ్య 50 అడుగుల భారీ గణపయ్య విగ్రహాన్ని 70 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో 26 టైర్ల టస్కర్‌ వాహనంలో నిమజ్జనానికి తరలించారు. ట్యాంక్‌ బండ్‌కు చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతికి ఉత్సవ సమితి సభ్యులు తుది పూజలు చేసి వీడ్కోలు పలికారు.

ప్రతి ఏడాది ఒక్కో ప్రత్యేక రూపంలో దర్శనమిచ్చే విఘ్నేశ్వరుడు.. ఈ ఏడాది శ్రీ పంచముఖ లక్ష్మీ మహా గణపతి రూపంలో కనువిందు చేశాడు. కుడివైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి, ఎడమవైపున శ్రీ త్రిశక్తి మహా గాయత్రీదేవి భక్తులకు దర్శనమిచ్చారు.

1954లో ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ గణపయ్య…2014లో 60 అడుగులకు చేరుకున్నాక షష్టి పూర్తి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆ తర్వాత ఒక్కో అడుగు తగ్గుతూ వస్తోంది. ప్రస్తుత పంచముఖ గణపయ్య విగ్రహం 50 అడుగులు. ఈ ప్రతిమను పూర్తిగా మట్టితో రూపొందించారు.

సుప్రీం కోర్టు ఆదేశాలు, తెలంగాణ ప్రభుత్వ సూచనలతో 68 ఏళ్లలో తొలిసారిగా గణపతి విగ్రహాన్ని పూర్తిగా మట్టితో తయారుచేశారు. శిల్పి రాజేందర్ నేతృత్వంలో ఈసారి రూపొందించిన 50 అడుగుల మట్టి విగ్రహం విశేషంగా ఆకట్టుకుంది.

జూన్ 10 నుంచి విగ్రహ నిర్మాణపనులు ప్రారభించారు. 150 మంది కళాకారులు అహర్నిశలు పనిచేయడంతో తుదిరూపు వచ్చేందుకు 80 రోజులు పట్టింది. విగ్రహ తయారీకి 35 టన్నుల మట్టిని వినియోగించారు.

ఇందుకోసం కోటిన్నర రూపాయలు ఖర్చు అయిందని నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం హుస్సేన్ సాగర్‌లో విగ్రహ నిమజ్జనం పూర్తయింది. స్థానిక పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 55 అడుగుల యజ్ఞోపవీతం, 50 అడుగుల కండువా విగ్రహానికి అలంకరించారు.

Related posts