telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రైతులకు అన్నీ కష్టాలే – కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ రైతు సర్కార్ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్‌ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు తెలంగాణ చరిత్రలొనే కాదు స్వాతంత్ర భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అన్నారు.

కేసీఆర్ మానస పుత్రిక రైతుబంధు అని అన్నారు. రైతు బంధు ద్వారా 50 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం మామూలు విషయం కాదు ఒక సాహసం అని కొనియాడారు.  కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సంక్రాంతి వరకు రైతుబంధు సంబురాలు జరుపుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. 

రైతులకు ఇంత మేలు జరుగుతుంటే కొందరు..ఈ మధ్య పొలిటికల్ టూరిస్ట్‌లు వచ్చి ఏదోదే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.65 లక్షల రైతులు కుటుంబాలు, 60 లక్షల టీ ఆర్ ఎస్ కార్యకర్తల తరపున సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

ఉమ్మడి ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో తెలంగాణ రైతులు నానా కష్టాలు పడ్డారని, రైతులకు కనీస మద్దతు ధర ఉండేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఆనాడు రైతుల ఆత్మహత్యలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ వన్ గా ఉండేదని, పాలకులు మారిన అన్నం పెట్టిన రైతుకు సున్నం పెట్టిన నేతలు నాటి సమైక్య పాలకులని కేటఆర్‌ విమర్శించారు.

తెలంగాణ రాకంటే ముందు ఈ ప్రాంత పరిస్థితి బోర్ల కింద పంటలు.. నేడు తెలంగాణ‌లో పచ్చని పొలాలు…పంటలు ఉన్నాయని ఆయన అన్నారు. పాలమూరుకు ఇప్పుడు వలస పోయిన కార్మికులు వెనక్కి వస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎకరా భూమి విలువ పది నుంచి పదిహేను లక్షలు పలుకుతోందని ఆయన వెల్లడించారు.కోటి ఎకరాల మాగాణే కాదు. ముక్కోటి టన్నుల ధాన్యాగారంగా తెలంగాణ మారిందన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూమి అమ్ముతామంటే కొనేవారు దిక్కులేరని.. ఇప్పుడు భూమి కొందామంటే.. అమ్మేవారు లేరని ఆయన పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలను తగ్గించడంలో తెలంగాణ ముందు ఉందని పార్లమెంట్ లో చెప్పారని ఆయన వెల్లడించారు.  రైతుబంధును కాపీ కొట్టి పలు పేర్లతో ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు.

Related posts