మీటూ వంటి పవర్ ఫుల్ ఉద్యమం వచ్చినప్పటికీ సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఆగడం లేదు. ఇప్పటికీ హీరోయిన్ గా అవకాశం ఇస్తామని చెప్పి మోడల్స్ ను లైంగికంగా వాడుకుంటున్నారు కొందరు. తాజాగా ఓ మళయాల స్టార్ ప్రొడ్యూసర్ పై అత్యాచారం కేసు నమోదు చేసింది ఓ మోడల్. వైశాఖ్ సినిమా బ్యానర్ పై “రోల్ మోడల్స్, చంక్స్, వెల్ కమ్ టు సెంట్రల్ జైల్” వంటి హిట్ చిత్రాలను నిర్మించి నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వైశాఖ్ రాజన్.
తాజాగా ఈ స్టార్ ప్రొడ్యూసర్ పై ఎర్నాకులం ప్రాంతానికి చెందిన ఓ మోడల్ అక్కడి నార్త్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వైశాఖ్ రాజన్ తాను నిర్మించబోయే సినిమాలో హీరోయిన్ గా అవకాశమిస్తానని చెప్పారని, ఆడిషన్స్ కోసం తనను ఆయన గెస్ట్ హౌస్ కు పిలిపించారని, అక్కడ తనను బలవంతంగా అత్యాచారం చేశాడని సదరు మోడల్ తన ఫిర్యాదులో పేర్కొంది. వైశాఖ్ రాజన్ పై సెక్షన్ 376 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎర్నాకులం నార్త్ సబ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.