ఐపీఎల్ 2021 వాయిదా పడినప్పటి నుంచి ఆసీస్ ఆటగాళ్లు మాల్దీవుల్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. అక్కడే క్వారంటైన్ తరహాలో బస చేశారు. భారత్ నుంచి ఆసీస్‌కు నేరుగా విమాన ప్రయాణాలను ఆసీస్ ప్రభుత్వం నిషేధించడమే ఇందుకు కారణం. ప్రతి ఏటా నిర్వహించే ఐపీఎల్ టోర్నీలో విదేశీ ఆటగాళ్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. అందులో ఆస్ట్రేలియా ఆటగాళ్లే ఎక్కువ మంది ఉంటారు. వారు లేని జట్టంటూ దాదాపు ఉండదు. కరోనా వైరస్ మహమ్మారి ఉన్నప్పటికీ.. బయో బుడగ ఏర్పాటు చేయడంలో ఈసారీ భారీ సంఖ్యలోనే క్రికెటర్లు భారత్ వచ్చారు. వారితో పాటు సహాయ సిబ్బంది, వ్యాఖ్యాతలు కూడా వచ్చారు. సజావుగా సాగుతున్న సమయంలో హఠాత్తుగా కేసులు వెలుగు చూడటంతో లీగ్ నిరవధికంగా వాయిదా పడింది. దాంతో మిగతా దేశాల ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లినా.. ఆస్ట్రేలియా ప్లేయర్స్ మాత్రం కొన్నాళ్లు మాల్దీవుల్లో ఉండాల్సి వచ్చింది. భారత్ నుంచి నేరుగా ఎవ్వరూ రాకూడదని.. క్రికెటర్లకూ మినహాయింపు ఉండదని ఆసీస్ ప్రధాని నిబంధనలు పెట్టడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో పాట్ కమిన్స్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మైఖేల్ స్లేటర్ సహా 38 మందితో కూడిన కంగారూల బృందం మాల్దీవుల్లో రెండు వారాలు బస చేసింది. ఆ తర్వాత న్యూసౌథ్ వేల్స్ ప్రభుత్వం వీరి క్వారంటైన్ వ్యవహారాలను పర్యవేక్షించింది. సోమవారం వీరంతా సిడ్నీకి చేరుకున్నారు. కరోనా బారిన పడిన ఆసీస్ మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ మైక్ హస్సీ.. ఖతార్ మీదుగా సోమవారం సాయంత్రం ఆసీస్ చేరుకోనున్నాడు.
previous post
అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలి: కన్నా