గతకొద్ది రోజులుగా బాలీవుడ్ స్టార్స్ హృతిక్, కంగనాల మధ్య వివాదం నడుస్తూనే ఉంది. ఈ వివాదం పక్కనపెడితే హృతిక్ కుటుంబానికి సంబంధించిన గొడవలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. హృతిక్ సోదరి సునైనాను వారి కుటుంబం ఇబ్బందుల పాలు చేస్తోందంటూ కంగనా సోదరి రంగోలి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై సునైనా స్పందించింది. మీడియా ముందుకు వచ్చి అసలేం జరుగుతుందో తెలిపే ప్రయత్నం చేసింది.
గతేడాది తనకు ఢిల్లీకి చెందిన ఓ ముస్లిం వ్యక్తితో పరిచయమైందని, అతడిని ఇష్టపడ్డానని, కానీ ఇంట్లో వారు ఒప్పుకోకపోవడం లేదని, నరకం చూపిస్తున్నారని, భరించలేకపోతున్నానని ఆరోపణలు చేసింది. తను ప్రేమించిన వ్యక్తిని కలవనివ్వడం లేదని, తనకు మాత్రం అతడితోనే ఉండాలనుందని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ విషయాలను కంగనా ద్వారా బయటపెట్టాల్సిన అవసరం ఏంటని ఓ విలేకరి ఆమెను ప్రశ్నించగా.. కంగనా మహిళా సాధికారతకు నిదర్శనమని, ఆపదలో ఉన్న మహిళలను వెంటనే ఆడుకోవాలనుకుంటారని చెప్పుకొచ్చింది. అంతేకాదు హృతిక్, కంగనాల మధ్య ఏం జరిగిందో తనకు తెలియదని, కానీ అతడి కారణంగా బాధ పడిన కంగనా న్యాయం కోసం పోరాడుతుందని, తన విషయంలో కూడా అదే జరుగుతోందని చెప్పింది. ప్రస్తుతం తను ఉన్న పరిస్థితుల్లో కంగనా తప్ప ఎవరూ సాయం చేయలేరనిపించిందని, అందుకే సంప్రదించినట్లు స్పష్టం చేసింది. అయితే ఈ వివాదం గురించి హృతిక్ ఫ్యామిలీ ఇంతవరకూ స్పందించలేదు.