కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేరతారా.. లేదా అని కొంతకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. తాను పార్టీలో చేరట్లేదని, తనకన్నా కాంగ్రెస్‌కు ‘నాయకత్వం’ అవసరమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆఫర్‌ను తిరస్కరించిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.. వ్యవస్థాగతంగా లోతైన సమస్యల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి పటిష్ట నాయకత్వం, సమన్వయం అవసరమని, కాంగ్రెస్‌లో క్షేత్రస్థాయిలో సంస్కరణలు, మార్పులు జరగాలని ట్వీట్ లో పీకే వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు రాకపోతే ప్రయోజనం లేదన్న పీకే.. సాధికారత కమిటీలో చేరాలని, ఎన్నికల బాధ్యత తీసుకోవాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనన తాను తిరస్కరించినట్టు వెల్లడించారు.
అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార తెరాస- ఐప్యాక్ మధ్య ఇటీవల ఒప్పందం జరగటమే.. పీకే కాంగ్రెస్‌లో చేరకపోవటానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. దీనిని కాంగ్రెస్ అధినాయకత్వం.. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కింద భావించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కాగా, 2024 లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధత కోసం ఇటీవల పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా సీనియర్ నేతలకు పీకే పవర్ పాయింట్ ప్రజెెంటేషన్ ఇచ్చారు. ప్రశాంత్.. ఎన్నికల వ్యూహాలు, నివేదికపై అధ్యయనం చేసేందుకు సోనియా గాంధీ.. కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం నేతృత్వంలో ఓ కమిటీ వేశారు. ఈ కమిటీ తమ నివేదికను సోనియాకు అందజేసింది.
అనంతరం ‘ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ -2024’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సోనియా.. రాబోయే ఎన్నికల్లో పార్టీ వ్యూహాల బాధ్యతను తీసుకోవాలని, అందుకోసం పార్టీలో చేరాలని ప్రశాంత్ కిశోర్‌ను కోరారు. అందుకు ఆయన తిరస్కరించినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా మంగళవారం ధ్రువీకరించారు.
కాంగ్రెస్‌లో చేరాలన్న అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆహ్వానాన్ని పీకే తిరస్కరించినట్లు పేర్కొన్నారు. 2024 ఎన్నికల కోసం ఏర్పాటు చేస్తున్న ఎంపర్డ్ కమిటీలో సభ్యుడిగా ఉండాలని పీకేను సోనియాగాంధీ కోరారని, కాంగ్రెస్‌కు సలహాదారుగా మాత్రమే ఉండడానికి పీకే అంగీకరించారని ట్వీట్ లో ఆయన స్పష్టం చేశారు. పార్టీకి సలహాలు, సూచనలు ఇచ్చినందుకు.. ప్రశాంత్ కిశోర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
I declined the generous offer of #congress to join the party as part of the EAG & take responsibility for the elections.
In my humble opinion, more than me the party needs leadership and collective will to fix the deep rooted structural problems through transformational reforms.
— Prashant Kishor (@PrashantKishor) April 26, 2022