telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీలో ఐపీఎల్ లో బెట్టింగ్ లకు ఒకరు బలి…

ఐపీఎల్‌ బెట్టింగ్‌ దందాకు గుంటూరు జిల్లాలో ఓ యువకుడు బలయ్యాడు. తాళ్లూరికి చెందిన సురేష్‌, కొమరయ్య… ఐపీఎల్‌లో పందాలు కాసి నష్టపోయారు. డబ్బుల కోసం నిర్వాహకులు ఇద్దరిపై ఒత్తిడి తీసుకురావడంతో… డబ్బు కట్టలేక రైల్వే ట్రాక్‌ దగ్గర పురుగుల మందు తాగారు. తాము చనిపోతున్నామంటూ సెల్ఫీ వీడియో తీసి బంధువులకు పంపారు. వెంటనే స్పందించి ఘటనాస్థలానికి వెళ్లిన బంధువులు… ఇద్దర్నీ గుంటూరులోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సురేష్‌ చనిపోగా… కొమరయ్య పరిస్థితి విషమంగా ఉంది. సురేష్ తల్లి వెంకటమ్మ మాట్లాడుతూ మేం చిలక జోస్యం చెప్పుకునే బ్రతికేవాళ్లమని, తమ బిడ్డను ఉన్నతంగా చదివించాలని ఆశపడ్డామని చెప్పుకొచ్చింది. సురేష్ ని ఇంటర్ వరకు చదివించామని అయితే స్నేహితుల వల్ల బెట్టింగ్ లకు అలవాటు పడ్డాడని పేర్కొంది. సత్తెనపల్లి కి చెందిన బాజీ , పేరేచర్ల కు చెందిన తిరుపతయ్య లు సురేష్ ను రోజు తీసుకెళ్ళేవారని, సత్తెనపల్లి లో బైక్ తాకట్టు పెట్టు 30 వేలు చెల్లించాడని ఇప్పుడు మిగిలిన డబ్బు కూడా కట్టాలని వత్తిడి చేస్తున్నారని ఆమె పేర్కొంది. బెట్టింగ్ నిర్వాహకుల వేదింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె ఆరోపించింది. అయితే ఈ ఘటన పై కేసు నమోదుచేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Related posts