ఏపీలోని ఆత్మకూరు నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి స్థానంలో ఆయన భార్య శ్రీకీర్తిని పోటీలో దింపే ఆలోచనలో వైసీపీ అధినాయకత్వం భావిస్తుంది.
ఫిబ్రవరి 21న మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే.. ఆయన మరణంతో ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.
దీంతో ఆయన స్థానంలో ఎవరికి అవకాశం దక్కబోతుందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఉప ఎన్నికలో మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీకీర్తి పేరు తెరపైకి వచ్చింది.
మేకపాటి రాజమోహన్ రెడ్డి వయసు మీద పడుతుండటం, గౌతమ్ రెడ్డి కుమారుడు వయసు రీత్యా చిన్నవాడు కావడంతో ఈ ఉప ఎన్నికల బరిలో శ్రీకీర్తిని పోటీ చేసే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధిష్టానం దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చిందంటూ పార్టీ, రాజకీయ వర్గాల్లో జోరుగ చర్చ జరుగుతుంది.
అయితే శ్రీకీర్తి పోటీ చేస్తారా, లేదా అనే అంశంపై క్లారిటీ లేదు. దీనిపై మేకపాటి కుటుంబం ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
ఒకవేళ ఆమె పోటీ చేస్తే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ పోటీ చేయకపోవచ్చని అంటున్నారు. ఈ ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆత్మకూరు ఉపఎన్నికను ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఖరారు చేయాల్సి ఉంది.
అంతేకాదు వచ్చే నెలలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉండటంతో గౌతమ్ రెడ్డి స్థానంలో ఎవరికి అవకాశం కల్పిస్తారన్నది చర్చనీయాంశమైంది.