telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

టీసీ కోసం రూ.2 వేలు లంచం.. ఏసీబీకీ చిక్కిన హెచ్ఎమ్ లలిత

ఇప్పటి వరకు రెవెన్యూ, ఇరిగేషన్‌ తదితర శాఖలకు పరిమితమైన లంచాలకు ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా అలవాటు పడుతున్నారు. ఓ ప్రధానోపాధ్యాయురాలు టీసీ కోసం రూ.2 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కిన సంఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో గురువారం జరిగింది. మండలంలోని బేగంపేట జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న దండుగుల లలిత విద్యార్థి నుంచి రూ.2 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఏసీబీ డీఎస్పీ కె.బద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పాఠశాలలో సుద్దాల ఓదెలు కుమారుడు రఘు గత విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివాడు. పరీక్షలు రాసిన రఘు భౌతికశాస్త్రంలో ఫెయిల్‌ అయ్యాడు. తర్వాత సప్లిమెంటరీ పరీక్ష రాసి పాస్‌ అయ్యాడు. ఉన్నత చదువుల కోసం టీసీ కావాలని ఇటీవల హెచ్‌ఎంను కలిసి కోరాడు. అందుకు రూ.2 వేలు ఇవ్వాలని లలిత డిమాండ్‌ చేసింది. ఇదే విషయాన్ని రఘు తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు విధిలేని పరిస్థితుల్లో 20 రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఓదెలు, రఘు హెచ్‌ఎం లలిత డిమాండ్‌ చేసిన రూ.2 వేలు తీసుకుని పాఠశాలకు వెళ్లారు. డబ్బులు ముట్టజెప్పి టీసీ తీసుకున్న తర్వాత ఏసీబీ అధికారులు హెచ్‌ఎంను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Related posts