telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

వరద నీటిలో ఈతకొట్టి మరీ .. బాక్సింగ్‌ పోటీలలో పాల్గొన్న యువకుడు..

youngman won bronze in boxing even floods

కర్ణాటకలోని బెలగావి సమీపంలోని మన్నూరు గ్రామానికి చెందిన నిషాన్‌ మనోహర్‌ (19) బాక్సింగ్‌ ఛాంపియన్‌ కావాలని ఆశయంగా పెట్టుకున్నాడు. ఎక్కడ పోటీలు నిర్వహించినా పాల్గొనేందుకు ముందువరుసలో ఉంటాడు. ఈ క్రమంలో ఆగస్టు 7 నుంచి బెంగళూరులో జరిగే రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొనాలని నిశ్చయించుకున్నాడు. గత వారం రోజులుగా కర్ణాటకలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మనోహర్‌ గ్రామంలోనూ వరదలు ముంచెత్తాయి. దీంతో పోటీలకు వెళ్లడానికి అతడికి వరదలు ఆటంకంగా మారాయి. పోటీల కోసం బెంగళూరు వెళ్లే రైలును చేరుకోవాలంటే తన గ్రామం నుంచి ఇక ఈత కొట్టడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. అలాంటి సంక్లిష్టమైన సమయంలో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి 45 నిమిషాల్లోనే 2.5కి.మీ మేర ఈదుకుంటూ వెళ్లాడు. బాక్సింగ్‌ కిట్‌ను ఓ ప్లాస్టిక్‌ డబ్బాలో పార్సిల్‌ చేసుకొని పోటీలకు వెళ్తున్న తమ బృంద సభ్యుల్ని చేరుకున్నాడు.

అతడి పట్టుదల ముందు వరదలు చిన్నబోయాయి. రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో ఎలాగైనా పాల్గొనాలన్న తపనతో క్రీడా ప్రాంగణానికి చేరుకొని ఆటల్లో తన ప్రతిభను ప్రదర్శించాడు. తద్వారా వెండి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మనోహర్‌ మాట్లాడుతూ.. గత కొద్ది రోజులుగా తనకు ఎదురైన అసౌకర్య పరిస్థితుల నేపథ్యంలో బంగారు పతకం సాధించలేకపోయానన్నాడు. పోటీలకు రావడానికి తానెన్ని ఇబ్బందులు పడిందీ వివరించాడు. దీంతో అక్కడికి వచ్చిన వారంతా ఒక్కసారిగా అతడిని ప్రశంసలతో ముంచెత్తారు. అనంతరం అతడి బృంద మేనేజర్‌ గజేంద్ర త్రిపాఠి మాట్లాడుతూ.. ఎన్ని కష్టాలు ఎదురైనా మనోహర్‌ పోటీల్లో బాగా రాణించి ప్రతిభ కనబరిచాడని పొగడ్తలతో ముంచెత్తారు. వచ్చే ఏడాది అతడు తప్పకుండా బంగారు పతకం సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీలకు 17 జట్ల నుంచి 248 మంది హాజరయ్యారు.

Related posts