telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

మహదానందంలో ఎర్రబెల్లి.. పంచాయత్ రాజ్ మంత్రిగా బాధ్యతలు..

ఎప్పటి నుండో మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్న ఎర్రబెల్లికి మొత్తానికి ఆ అవకాశం రానేవచ్చింది. దానితో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నేడు ఆయన తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినందుకు సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రుణపడి ఉంటానని తెలిపారు. గ్రామ పంచాయతీలను అందంగా తీర్చిదిద్దాలని ఎర్రబెల్లి ఆకాంక్షించారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టంతో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

35 ఏళ్ల తన రాజకీయ జీవితంలో 25 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశాననీ, ఎన్నడూ ఇంత సంతోషం కలగలేదని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. అప్పట్లో ఎన్టీఆర్ తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పినప్పటికీ కొన్ని శక్తులు అడ్డుకున్నాయని తెలిపారు. చంద్రబాబు కూడా ఈ విషయంలో తనను మోసం చేశారన్నారు. పంచాయతీ రాజ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎర్రబెల్లికి – మంత్రి మల్లారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, రాజయ్య, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, శంకర్‌ నాయక్‌, పెద్ది సుదర్శన్‌, అరెకపూడి గాంధీ, ప్రకాష్‌ గౌడ్‌, మాగంటి గోపీనాథ్‌, కెచర్ల భూపాల్‌ రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ రెడ్డి, గుండు సుధారాణి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

Related posts