telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

కాళేశ్వరంపై వైసీపీ స్వరం : ..ప్రతిపక్షంలో వద్దన్నారు .. అధికారపక్షంలో ముఖ్యఅతిథి అయ్యారు.. !!

YCP padma comments Chandrababu

ఆంధ్ర సీఎం కాళేశ్వరం ప్రారంభోత్సవానికి వెళ్తే భవిష్యత్తులో అనేక అంశాలపై నోరెత్తలేని పరిస్థితి వస్తుంది. పైగా ఆంధ్ర తరపున ఆ ప్రాజెక్టుకు అంగీకారం తెలియజేసినట్టే! ముఖ్య అతిథి హోదా తొలుత మురిపించినా ఆ తర్వాత ముంచేస్తుంది. నష్టనివారణకు అవకాశమే ఉండదు. వేరే వాడు తీసుకున్న రుణానికి ‘ష్యూరిటీ సంతకం’ పెట్టినట్టే! తెలంగాణ ప్రభుత్వం తెలివిగా పోలవరంపై అభ్యంతరాల్నీ కోర్టు కేసుల్నీ ఓవైపు కొనసాగిస్తూ మరోవైపు ఒరిస్సా ప్రభుత్వాన్నీ తనమార్గంలోకి రప్పించుకుని ఉమ్మడి న్యాయపోరాటానికి సిద్ధమవుతూనే..కాళేశ్వరం ప్రారంభ సంరంభంలో ఆంధ్రకు పెద్దపీట వేయాలని చూడటం పక్కాగా పన్నిన ద్విముఖ వ్యూహమే.

చంద్రబాబు వ్యతిరేకతే ప్రాతిపదికగా కలసి ప్రదర్శించిన ‘అసాధారణ మైత్రి’ ఫలించిన నేపథ్యంలో తన మాట జవదాటని ప్రభుత్వం ఆంధ్రలో కొలువుతీరాలన్న పట్టుదలా పంతాన్నీ తెలంగాణ నాయకత్వం అన్ని రకాల ప్రయత్నాలతో నెగ్గించుకుంది.
అయితే ఎన్ని అభ్యంతరాలు వ్యక్తమైనా సరే ఆంధ్ర నాయకత్వం మాత్రం తెలంగాణతో నిక్కచ్చిగా వ్యవహరించే అవకాశమే లేదనడానికి..అర్థరాత్రి సెక్రటేరియట్ భవనాల అప్పగించిన ఘటనే నిదర్శనం. ఆంధ్ర నాయకత్వం ఎదుర్కొంటున్న రాజకీయ అనివార్యత అలాంటిది మరి! భవనాల అప్పగింతపై ప్రజల్లో అలజడి రాకుండా..భద్రాచలం పట్టణాన్ని ఆంధ్రకు ఇచ్చివేసే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదనే విషయాన్ని ఉద్దేశ్యపూర్వకంగానే ప్రచారంలో పెట్టడం గమనార్హం. అది జరిగేది కాదనే విషయం అందరికీ తెలుసు.

ఏడు మండలాల్ని ఆంధ్ర ఆక్రమంగా ఆర్డినెన్స్ ద్వారా గుంజుకున్నదని నిన్నటివరకూ తూర్పారబట్టిన తెలంగాణ నాయకత్వం..రేపు భద్రాచలం ఇస్తుందంటే నమ్మేదెవరు? భద్రాచలం పట్టణం బ్రిటిష్ పాలనలో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో భాగంగా ఉండేది. ఆవిషయాన్ని సైతం కేంద్రానికి నొక్కిచెప్పలేని దద్దమ్మలుగా ఆంధ్రనేతలు మిగిలిపోవడంతో విభజన ప్రక్రియలో భద్రాచలం తెలంగాణకు వెళ్ళిపోయింది. అలాంటి వ్యవహారంపైన సైతం అసత్యాల్ని ప్రచారంలో పెట్టడం ద్వారా ఆంధ్ర ప్రజల ఆలోచనల్ని ప్రభావితం చేసే ప్రయత్నం మాత్రం గర్హనీయం. ఏమైనప్పటికీ ఆంధ్ర ప్రభుత్వం..తెలంగాణ చేతుల్లో మొహమాటానికి గురై ..రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగే పరిస్థితులు ఉత్పన్నమైనా ఎదిరించలేని అశక్తురాలిగా మిగిలిపోయే అవకాశం ఉన్నట్లు స్పష్టమౌతోంది! దీనిపై ఆంధ్ర నాయకత్వం నిశిత పరిశీలన చేసుకుని ముందడుగు వేయాలన్నదే సగటు ఆంధ్రుడి గాఢమైన కోరిక!

నాటి మాట!
16-5-2016న వైసీపీ అధినేత జగన్ కర్నూలులో కాళేశ్వరం శంకుస్థాపనకు వ్యతిరేకంగా 3 రోజులు దీక్షలు చేపట్టారు. అదే వ్యక్తి నేడు ముఖ్యఅతిథిగా సదరు ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరవుతున్నారు.. ఇది ఏపీ ప్రజలకు ఇచ్చే ఎటువంటి సందేశమో చెప్పాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర సీఎం గా జగన్ గారికి ఉందని .. విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts