telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

50 శాతం రిజర్వేషన్ కల్పిస్తానంటున్న.. వైసీపీ జగన్ !

ycp jagan bc declaration meeting

తాజాగా, వైసీపీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన బీసీ గర్జన సభలో జగన్ హామీల జల్లు కురిపించారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన ఆయన విద్యార్థుల నుంచి మొదలుకొని చిరువ్యాపారులు, చేతి వృత్తిదారులు, మహిళలు అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే.. బీసీల అభివృద్ధి కోసం ప్రతి ఏడాది బడ్జెట్‌లో 15 వేల కోట్ల రూపాయలు చొప్పున ఐదేళ్లలో 75వేల కోట్లు కేటాయిస్తామన్నారు జగన్. బీసీ సబ్ ప్లాన్ ను, బీసీ కమిషన్ ను చట్టబద్ధం చేసి శాశ్వత ప్రాతిపదికన న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. చదువుకునే విద్యార్థులకు ఏడాదికి15 వేలు, హాస్టల్ కు 5 వేల చొప్పున చెల్లిస్తామని తెలిపారు. చిరు వ్యాపారులు, చేతివృత్తిదారులకు వడ్డీ లేకుండా 10 వేలు తక్షణ రుణం అందిస్తామన్నారు. 45 నుండి 60 ఏళ్ల మధ్య మహిళలకు 75 వేలు ఉచితంగా వైఎస్సార్ చేయూత పథకం ద్వారా అందిస్తానని హామీ ఇచ్చారు జగన్. 139 బీసీ ఉప కులాలకు విడివిడిగా ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు థర్డ్ పార్టీ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలతో పాటు, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లోనూ 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు జగన్. తనకు ఒక్క అవకాశం ఇస్తే, ప్రతి హామీని నెరవేర్చి చూపుతానన్నారు. మళ్లీ 2024ల్లోపు బీసీ లను అభివృద్ధి చేశాకే ఓట్లు అడిగేందుకు వస్తానంటూ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని సైతం పూరించారు. ఇక బీసీ గర్జన సభలో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు జగన్. 2014 ఎన్నికల ముందు 119 వాగ్ధానాలతో టీడీపీ చేసిన బీసీ డిక్లరేషన్‌కు దిక్కులేకుండా పోయిందన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఏమైందని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబుకు రైతులు, నిరుద్యోగులు గుర్తుకు వచ్చారని విమర్శించారు జగన్.

ఏలూరు సభకు ఏపీ నలుమూలల నుండి వైసీపీ శ్రేణులతో పాటు బీసీ లు వేలాదిగా తరలివచ్చారు. దీంతో సభా ప్రాంగణం జనసంద్రమైంది. ఏలూరు బీసీ గర్జన సభ చారిత్రాత్మకమని వైసీపీ నేతలు చెబుతున్నారు.

Related posts