telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ప్రపంచ కప్ ఫైనల్స్ లో .. తప్పుడు నిర్ణయాలు .. మండిపడుతున్న మాజీలు..

wrong decisions on world cup finals viral issue

ప్రపంచకప్ ఫైనల్ లో భాగంగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ గతంలో ఎన్నడూ లేనన్ని విమర్శలను మూటగట్టుకుంది. మ్యాచ్ టై కావడంతో ఫలితాన్ని తేల్చేందుకు నిర్వహించిన సూపర్ ఓవర్ కూడా టై అయింది. దీంతో మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించడం వివాదాస్పదమైంది. ఇప్పుడు తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. గప్టిల్ ఓవర్ త్రోకు అంపైర్లు ఆరు పరుగులు ఇవ్వడం సరికాదన్న అభిప్రాయం సర్వత్ర వ్యక్తమవుతోంది. ఈ విషయంలో ఫీల్డ్ అంపైర్లు పూర్తిగా తప్పు చేశారని అంతర్జాతీయ మాజీ అంపైర్లు సైమన్ టౌఫెల్, హరిహరన్‌లు అభిప్రాయపడ్డారు.

ఐదుసార్లు ఐసీసీ ‘అంపైర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అందుకున్న టౌఫెల్ మాట్లాడుతూ.. ఆ ఓవర్ త్రోకు ఇవ్వాల్సింది ఐదు పరుగులేనని అన్నారు. ఐసీసీ నిబంధనలు కూడా ఇవే చెబుతున్నాయని అన్నాడు. న్యూజిలాండ్ ప్రపంచకప్ ఆశలను కుమార ధర్మసేన చిదిమేశాడని మరో మాజీ అంపైర్ హరిహరన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్లో ఓవర్ త్రో కారణంగా ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు లభించాయి. ఫీల్డర్ విసిరిన బంతి రెండో పరుగు తీస్తున్న స్టోక్స్ బ్యాట్‌కు తాకి బౌండరీకి వెళ్లింది. దీంతో బ్యాట్స్‌మెన్ అప్పటి వరకు తీసిన రెండు పరుగులకు ఓవర్ త్రో ద్వారా లభించిన నాలుగు పరుగులు కలిపి అంపైర్లు ఆరు పరుగులు ఇచ్చారు. సరిగ్గా ఇదే ఇప్పుడు వివాదాస్పదమైంది.

ఐసీసీలోని ఓ నిబంధన ప్రకారం.. ఫీల్డర్ ఓవర్ త్రో కారణంగా బంతి బౌండరీకి వెళ్తే నాలుగు పరుగులు ఇస్తారు. బ్యాట్స్‌మెన్ అప్పటి వరకు పూర్తిచేసిన పరుగులను కూడా వీటికి చేరుస్తారు. ఈ లెక్కన ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు ఇవ్వడం సమంజసమే. ఇక్కడే ఓ మెలిక ఉంది. ఫీల్డర్ బంతి విసిరే సమయానికి క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్ ఇద్దరూ ఒకరినొకరు దాటాలి. గప్టిల్ బంతి విసిరే సమయానికి రెండో పరుగు తీస్తున్న స్టోక్స్-రషీద్‌లు ఒకరినొకరు దాటలేదు. టీవీ రీప్లేల్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఫీల్డ్ అంపైర్లు మాత్రం రెండు పరుగులు కలిపి మొత్తం ఆరు పరుగులు ఇచ్చేశారు. కివీస్ ఓటమికి ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. టీవీ అంపైర్‌ను సంప్రదించి నిర్ణయాన్ని మార్చే అవకాశం ఉన్నా ఫీల్డ్ అంపైర్ ఎరాస్మస్ ఆ పనిచేయలేదని అంపైర్ హరిహరన్ తప్పుబట్టారు.

Related posts