telugu navyamedia
ట్రెండింగ్

ప్రపంచంలోనే అతి తక్కువ బరువుతో … పుట్టిన మగబిడ్డ..

world record under weight baby

ఆ పసిగుడ్డు అత్యంత తక్కువ బరువుతో ఈ ప్రపంచంలోకి వచ్చింది. జపాన్‌లో పుట్టిన ఆ బిడ్డ బరువు ఆపిల్‌ పండంత. గట్టిగా పావుకిలో. 2018 అక్టోబర్‌ 1న జన్మించిన ఆ మగబిడ్డను తక్కువ బరువుతో ఉండటంతో నియోనేటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉంచి సంరక్షించారు. ఇప్పుడు బయటి ప్రపంచంలోకి వచ్చేందుకు సంసిద్ధమైనట్లు శుక్రవారం వైద్యులు ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత తక్కువ బరువుతో జన్మించిన మగబిడ్డ రికార్డు ఈ పసిగుడ్డుదే.

టొషిక అనే గర్భిణి అధిక రక్తపోటుతో బాధపడుతుండటంతో 24 వారాల 5 రోజులకే అత్యవసర సిజేరియన్‌ శస్త్రచికిత్స ద్వారా కాన్పు చేశారు. 258 గ్రాముల బరువుతో ర్యుసుకె సెకియా జన్మించాడు. జపాన్‌లో అంతకుముందు 268 గ్రాముల బరువుతో జన్మించిన బిడ్డదే రికార్డు, ఇప్పుడు అంతకన్నా తక్కువ బరువుతో, 22 సెంటీమీటర్ల పొడవుతో సెకియా పుట్టాడు.

ఈ బిడ్డను ఆస్పత్రి సంరక్షణలో ఉంచి గొట్టాలు, పత్తి ఉండల ద్వారా తల్లిపాలు అందించారు. 7 నెలల తర్వాత బిడ్డ 13 రెట్లు పెరిగి ప్రస్తుతం 3 కిలోల బరువుతో ఉన్నారు. ఈ వారాంతంలో మధ్య జపాన్‌లోని నగానో పిల్లల ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేసేందుకు అంతా సిద్ధం చేశారు.

Related posts