telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

విఫలమైనా .. భారత శాస్త్రవేత్తల మానసికస్తైర్యానికి .. జోహార్ అన్న ప్రపంచ మీడియా ..

world media on chandrayan-2

ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రాజెక్టు విఫలం కావడం పట్ల విదేశీ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. అమెరికా పత్రిక వైర్డ్ ఓ కథనంలో స్పందిస్తూ, చంద్రయాన్-2ను అత్యంత ప్రతిష్ఠాత్మక మిషన్ గా అభివర్ణించింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ను కోల్పోవడం భారత అంతరిక్ష కార్యక్రమానికి పెద్ద ఎదురుదెబ్బ అని పేర్కొంది. అయితే, తుది దశలో వైఫల్యంతో అంతా నాశనం అయింది అనుకోవడానికి లేదని వైర్డ్ వివరించింది. న్యూయార్క్ టైమ్స్ పత్రికలో చంద్రయాన్-2పై పొగడ్తలు కురిపించింది. తన తొలి ప్రయత్నంలోనే విజయం సాధించకపోయి ఉండొచ్చు, కానీ, భారత ఇంజినీరింగ్ నైపుణ్యం, దశాబ్దాల అంతరిక్ష పరిశోధన మాత్రం హైలైట్ అయ్యాయని తన కథనంలో పేర్కొంది. చంద్రయాన్-2 ప్రాజెక్టులో పాక్షిక వైఫల్యం కారణంగా భారత్ అరుదైన ఘనత సాధించిన దేశాల సరసన నిలిచే అవకాశాన్ని కోల్పోయిందని వెల్లడించింది.

ది వాషింగ్టన్ పోస్ట్, చంద్రుడిపై కాలు మోపేందుకు భారత్ చేసిన తొలి ప్రయత్నం విఫలమైనట్టు కనిపిస్తోందని కథనం ప్రచురించింది. జాతికి గర్వకారణంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టు నిలిచిపోయినా గానీ, ఇస్రో, దాని శాస్త్రవేత్తలకు సోషల్ మీడియాలో విశేషరీతిలో మద్దతు లభిస్తోందని తెలిపింది. భారత యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రచారం పొందిన ఈ స్పేస్ ప్రాజెక్టు వైఫల్యం ఆశలు రేకెత్తిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనలకు విఘాతం అని వివరించింది. సీఎన్ఎన్ కూడా తనదైన శైలిలో భాష్యం చెప్పింది. “చారిత్రాత్మక రీతిలో చంద్రుడిపై రోవర్ ను దింపాలన్న భారత్ ప్రయత్నం విఫలమై ఉంటుంది. ల్యాండర్ ను చంద్రుడిపై దింపే క్రమంలో ఇస్రో బృందంలో ప్రతి చిన్న ప్రక్రియకు విశేషంగా స్పందించి సంబరాలు చేసుకుంది. కానీ నిర్దేశిత ప్రాంతంలో ల్యాండర్ దిగకపోవడంతో అక్కడ నిశ్శబ్దం ఆవరించింది” అంటూ సీఎన్ఎన్ వెల్లడించింది.

బ్రిటీష్ మీడియా విషయానికొస్తే, భారత్ జాబిల్లి యాత్ర చివరి నిమిషంలో కమ్యూనికేషన్ లోపం కారణంగా నిలిచిపోయిందంటూ భారత్ లో ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ ప్రతినిధి మాథ్యూ వీస్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ ‘ది గార్డియన్’ పత్రిక పేర్కొంది. ఈ విధంగా అయితే చంద్రుడిపై మానవ సహిత యాత్ర చేయడానికి భారత్ కు మరో 20, 50, 100 ఏళ్లయినా పట్టొచ్చని వీస్ చేసిన వ్యాఖ్యలను గార్డియన్ ప్రముఖంగా ప్రచురించింది. బీబీసీ ప్రముఖంగా చంద్రయాన్-2 బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని వార్తలు రాసింది. ఇది ఎంతో చవకైన ప్రాజెక్టు అని, చంద్రయాన్-2 ప్రాజెక్టుకైన వ్యయం కంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా బడ్జెట్ రెండింతలు ఎక్కువని తెలిపింది. ఫ్రెంచ్ పత్రిక లె మోండే ‘చెదిరిన కల’ అంటూ కథనం వెలువరించింది.

Related posts