telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు విద్యా వార్తలు

సింగరేణిలో గనులలోకి.. మహిళలు, కేంద్ర తాజా నిర్ణయం..త్వరలో నోటిఫికేషన్

women allowed for jobs in mines in india

బొగ్గుగనులలో జాబ్స్ అంటేనే విపరీతమైన గిరాకీ ఉంటుంది. అటువంటి వాటిలో ప్రమాదం కూడా అంతే ఉంటుంది. అయితే ఈ గనులలోకి మహిళలను కూడా అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మహిళలు బొగ్గుగనుల్లో పనిచేసేందుకు అవకాశం కల్పిస్తూ కేంద్ర కార్మికశాఖ తాజాగా గనుల చట్టాన్ని సవరించింది. తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో విధులు నిర్వర్తించే అవకాశం మహిళలకు లభించనుంది. 1952లో గనుల్లో మహిళలు పనిచేయడాన్ని నిషేధించగా, తాజాగా కేంద్రం నిర్ణయంతో 67 ఏండ్ల తర్వాత మహిళలు గనుల్లో పనిచేసే అవకాశం లభించింది. ఇప్పటివరకు పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న సుమారు 600పైగా ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తున్న సింగరేణి, కోల్ ఇండియా నిర్ణయం మేరకు మహిళలకు అవకాశం కల్పించనుంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి లాభాలబాటలో దూసుకుపోతున్నది. ఒకవైపు కార్మికులకు మంచి జీతం, జీవితం ఉండటం.. మరోవైపు భద్రతాచర్యల కారణంగా ప్రమాదాలు తగ్గటంతో సింగరేణి ఉద్యోగం ఆకర్షణీయంగా మారింది. రాష్ట్రంలోని యువతతోపాటు సింగరేణి విస్తరించిన జిల్లాలవారు ఈ ఉద్యోగాలకు పోటీపడుతున్నారు. సుదీర్ఘ చరిత్ర గల సింగరేణిలో మహిళల భాగస్వామ్యం చాలా తక్కువ. అన్ని విభాగాల్లో కలుపుకొని కేవలం 2.4 శాతం మహిళలు మాత్రమే ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. 56,282 మంది కార్మికులు ఉంటే, అందులో 1,362 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. వీరు కూడా ఉపరితల కార్యాలయాల్లో క్లర్కు, క్యాంటీన్ వర్కర్లు, స్వీపర్లు తదితర పనులు చేస్తున్నారు. సింగరేణిలో మహిళా శక్తి పెరుగకపోవడానికి ఇన్నాళ్లు అడ్డంకిగా ఉన్న నిబంధనలే కారణం. 29 భూగర్భ, 19 ఓపెన్‌కాస్ట్ గనులతో సింగరేణి ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తరించింది. ఇందులో భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనుల్లో జనరల్ మజ్దూర్, పంప్ ఆపరేటర్, కన్వేయర్ ఆపరేటర్, కోల్ కట్టర్, ఫిట్టర్, హెల్పర్, సర్వేయర్ తదితర 50 రకాల హోదాల్లో ఉద్యోగాలున్నాయి.

సింగరేణిలో బొగ్గు వెలికితీయటంతోపాటు అనేక ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. 1988 తర్వాత ఒక్క ఉద్యోగం కోసం కూడా రాత పరీక్ష నిర్వహించలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2015లో 450 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి సంస్థ రాత పరీక్ష నిర్వహించింది. ఇలా పలు విభాగాల్లో మొత్తం 7,500 పైగా ఉద్యోగాలను భర్తీ చేసింది. వీటిలో ఉపరితలంలో పనిచేసే ఉద్యోగాలకు మాత్రమే మహిళలకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం పలు విభాగాల్లో 600పైగా ఖాళీలను సింగరేణి గుర్తించింది. వీలైనంత త్వరలో నోటిఫికేషన్ ద్వారా పోస్టులు భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది.

Related posts