• Home
  • Trending Today
  • ఆదివారమే సెలవు ఎందుకు ? ఒక్కరోజు సెలవు కోసం మహా ఉద్యమమే జరిగిందని మీకు తెలుసా ?
Trending Today జ్ఞాపకం రాజకీయ వార్తలు విద్య వార్తలు సంప్రదాయ సామాజిక

ఆదివారమే సెలవు ఎందుకు ? ఒక్కరోజు సెలవు కోసం మహా ఉద్యమమే జరిగిందని మీకు తెలుసా ?

sunday

స్కూలుకు వెళ్ళే చిన్న పిల్లల దగ్గర నుంచి ఉద్యోగాలకు వెళ్లే పెద్దల వరకు ప్రతి ఒక్కరూ “ఆదివారం” గురించి ఎదురు చూస్తారు. వారం మొత్తం తమ దైనందిన జీవితంలో పనితో బిజీగా గడుపుతారు. అయితే ఆదివారం సెలవు కాబట్టి రెస్ట్ తీసుకుందామని అనుకుంటాము. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? ఆదివారం మాత్రమే ఎందుకు సెలవు ఉండాలి ? అని… నిజానికి ఈ విషయం చాలా మందికి తెలియదు. కొందరికి ఈ ఆలోచన వచ్చినా కూడా కాసేపు ఆలోచించి వదిలేస్తారు. అయితే ఇప్పుడు ఆదివారం సెలవు ఎలా వచ్చింది ? అనేది తెలుసుకుందాం.

హిందూ సంప్రదాయం ప్రకారం ఆదివారాన్ని “రవివారం” అని కూడా పిలుచుకుంటాము. ఎందుకంటే మన పురాణాల్లో ఈరోజు సూర్యుడు అధిపతి అని ఉంది. కాబట్టి సూర్యుడి పేరులోని “రవి”ని తీసుకుని రవివారంగా పిలుచుకుంటాము. అప్పట్లో మనదేశంలో సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా కొలిచేవారు. అందుకే సూర్యదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు ప్రత్యేక పూజలు, ఉపవాసాలు వంటివి చేసేవారు ప్రజలు. అందుకే మన హిందూ సంప్రదాయంలో ఆదివారానికి ఒక ప్రత్యేక స్థానం లభించింది. అలాగే క్రైస్తవులు పవిత్రంగా భావించే “బైబిల్”లో కూడా ఆదివారానికి ప్రత్యేక స్థానం ఉంది. క్రైస్తవ మతానికి మూల పురుషుడైన ఏసుక్రీస్తు చనిపోయిన తరువాత మూడవ రోజు తిరిగి బ్రతికాడని బైబిల్ లో పేర్కొనబడింది. ఆయన అలా బ్రతికిన రోజు ఆదివారం… అందుకే ప్రతి సంవత్సరం “గుడ్ ఫ్రైడే” తరువాత వచ్చే ఆదివారాన్ని “ఈస్టర్ సండే”గా జరుపుకుంటారు క్రైస్తవులు.

ఇదిలా ఉండగా ప్రజలందరూ ప్రతిరోజూ పనికి వెళ్ళడం వలన వారికి తమ కుటుంబం పట్ల, దైవం పట్ల భక్తిశ్రద్ధలు తగ్గిపోతాయని ఉద్దేశ్యంతో క్రైస్తవ మతపెద్దలు వారంలో ఒకరోజు సెలవు ఉండాలని భావించారు. అయితే “ఆదివారం” కంటే శ్రేష్ఠమైన రోజు లేదని భావించి, ఆరోజు ప్రజలంతా తమ కుటుంబంతో కలిసి దైవారాధన చేసి సంతోషంగా ఉండాలనే ఆలోచనతో ఆదివారాన్నే సెలవు దినంగా తీర్మానించారు. ఈ తీర్మానాన్ని అప్పటి పాలకులు అమలు చేశారు. వారి తరువాత తరాలు కూడా పాటించడంతో పాటు క్రైస్తవమతం వ్యాప్తి చెందిన ప్రాంతాల్లో కూడా “ఆదివారం సెలవు” అనే పద్ధతి సంప్రదాయంగా మారిపోయింది.

ఇక బ్రిటీషువారు మనదేశాన్ని ఆక్రమించుకోకముందు భారతీయులు ఆదివారాన్ని ఒక పవిత్రంగా భావించేవారు తప్ప “ఆదివారం సెలవు” అనే పద్ధతి లేదు. ఎందుకంటే పూర్వం మనదేశంలోని ప్రజలంతా వ్యవసాయ సంబంధిత పనులనే ఎక్కువగా చేసేవారు. ఇక బ్రిటీషువారు మనదేశాన్ని ఆక్రమించుకున్నాక వారు తలపెట్టిన వివిధ కార్యాలకు మనదేశ ప్రజలను కూలీలుగా వాడుకునేవారు. ఎంతోకొంత డబ్బులు వస్తుండడంతో చాలామంది ప్రజలు బ్రిటిషువారి దగ్గర పనికి వెళ్లేవారు. దీనివల్ల సంఘంలో తలెత్తే సమస్యలను పరిష్కరించుకోవడానికి సమయం కేటాయించలేకపోయేవారు ప్రజలు. దీనివల్ల అప్పటి మన భారతదేశంలో ఎన్నోరకాల సమస్యలు తలెత్తాయి.

అయితే వారంలో ఒకరోజు అందరికీ సెలవు ఉండాలని, ఆరోజు ప్రజలంతా తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి కేటాయించాలని భావించిన నారాయణ్ మేఘాజి లోఖండే అనే అభ్యుదయవాది “ఆదివారం సెలవు” కావాలంటూ బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పటికే బ్రిటిషు దేశాలలో “ఆదివారం సెలవు” అమలులో ఉంది. కానీ బ్రిటిషు వారు ఆయన డిమాండ్ ను అంగీకరించకుండా భారతీయులను బానిసలుగా చేసి పని చేయించుకునేవారు. ఈ విషయాన్ని గ్రహించిన నారాయణ్ 1881లో “ఆదివారం సెలవు” కావాలనే నినాదాన్ని లేవనెత్తారు. ఆయన డిమాండ్ ను బ్రిటీషువారు ఒప్పుకోకపోవడంతో అప్పట్లోనే ఒక ఉద్యమాన్ని లేవనెత్తారు. ఈ ఉద్యమం ఎనిమిదేళ్లు సాగి చివరగా మహాఉద్యమంగా ఆవిర్భవించింది. నారాయణ మేఘాజీ నాయకత్వంలో అఖండ భారతదేశం మొత్తం ఆందోళనలు చేశారు.

నారాయణ్ చేస్తున్న ఉద్యమానికి అప్పటి సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే కూడా తోడు నిలిచారు. అంతకుముందు జ్యోతిరావు పూలే చేసిన “సత్యసాధన” ఉద్యమంలో నారాయణ్ ఒక కార్యకర్తగా పనిచేయడంతో ఇద్దరికీ మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ మహా ఉద్యమానికి తలొగ్గిన బ్రిటిషు ప్రభుత్వం 1889లో “ఆదివారం సెలవు” ప్రకటించింది. ఈ విధంగా భారతదేశంలో జరిగిన మొదటి కార్మిక ఉద్యమ కార్యకర్తగా “నారాయణ్ మేఘాజీ లోఖండే” పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. ఆ తరువాత కూడా నారాయణ్ కార్మికుల కోసం ఎన్నో కార్మిక ఉద్యమాలు చేశారు. అంతేకాదు అప్పట్లో ఎంతో ప్రాచుర్యం కలిగిన “దీనబంధు” పత్రికలో బాధ్యతలు నిర్వర్తించారు. ఈ విధంగా చివరి వరకూ కార్మికుల సంఘ సంస్కరణకు పాటుపడి 1897లో ముంబై నగరంలో మరణించారు. ఈ మహనీయుడు చేసిన విశేష కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2005లో ఆయన జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసింది. మనం వారమంతా కష్టపడి, వారంలో ఒకరోజు సెలవు తీసుకొని హ్యాపీగా గడుపుతున్న “ఆదివారం” వెనుక ఇంత చరిత్ర ఉంది.

– విమలత

Related posts

మహిళా జర్నలిస్టు దారుణ హత్య

madhu

స్పీకర్ కోడెలకు ఊరట..వ్యక్తిగత హాజరు అవసరం లేదన్న కోర్టు…

chandra sekkhar

కుమార్తెతో కలిసి మ్యాచ్‌కి హాజరైన ఐశ్యర్య అభిషేక్

jithu j

Leave a Comment